ఉత్సాహంగా ఉజ్జయిని ఉత్సవం
సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎం కెసిఆర్
తెల్లవారుజాము నుంచే పొటెత్తిన భక్తులు
ప్రజాపక్షం / హైదరాబాద్; బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం తెల్లవారు జాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన కెసిఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలో నిల్చున్న భక్తుల కు అభివాదం చేశారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ఎం.మల్లారెడ్డి, తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారీగా వర్షాలు కురిసి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.