జెఎన్‌యు ‘రాజద్రోహం’ కేసులో కన్హయ్య కుమార్, ఇతరులపై అభియోగపత్రం
నిజాలు నిగ్గు తేలుతాయి : కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం(జెఎన్‌ఎస్‌యు) మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతరులపై ఢిల్లీ పోలీసులు 2016లో దాఖలైన రాజద్రోహం కేసులో సోమవారం అభియోగపత్రం దాఖలు చేశారు. ఫిబ్రవరి 9న యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణపై జెఎన్‌యు మాజీ విద్యార్థులు ఉమర్ ఖాలిద్, అనిరబ్ భట్టాచార్యపై పోలీసులు అభియోగం పెట్టారు. పార్లమెంటుపై దాడికి మూలకారకుడైన అఫ్జల్ గురు ఉరి సంస్మరణకు 2016 ఫిబ్రవరి 9న ఈ ఈవెంట్ జరిగింది. అందులో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కేసులో కశ్మీరీ విద్యార్థులు అఖిబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రాయియా రసూల్, బషీర్ భట్, బష్రత్‌లపై కూడా పోలీసులు చార్జిషీటు పెట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) నాయకుడు డి. రాజా కూతురు అపరజిత, హెహలా రషీద్ (నాటి జెఎన్‌యుఎస్‌యు ఉపాధ్యక్షుడు), రామనాగ, అశుతోష్ కుమార్, బనోజ్యోత్స లాహిరి సహా దాదాపు 36 ఇతరుల పేర్లను తగిన ఆధారాలు లేనందున చార్జిషీటులోని 12వ కాలమ్‌లో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుమిత్ ఆనంద్ ఆ చార్జిషీటును పరిశీలనార్థం మంగళవారం కాంపేటెంట్ కోర్టు ముందుపెట్టారు. నిందితులపై ఐపిసి సెక్షన్లలోని 124ఎ(రాజద్రోహం), 323 (కావాలని స్వచందంగా బాధించినందుకు శిక్ష), 465(ఫోర్జరీ చేసినందుకు శిక్ష), 471(ఓ ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్‌ను లేక ఎలక్ట్రానిక్ రికార్డును అసలైనదిగా ఉపయోగించడం), 143(చట్టవ్యతిరేకంగా సమావేశమైనందుకు శిక్ష), 149(చట్టవ్యతిరేక సమావేశంలో సభ్యుడిగా ఉన్నందుకు), 147(అల్లర్లు చేసినందుకు శిక్ష), 120బి(నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు పెట్టారు. చార్జిషీటులో సిసిటివి ఫుటేజిలు, మొబైల్ ఫుటేజిలు, డాక్యుమెంటరీ సాక్షాలు కూడా ఉన్నాయి. దాదాపు 1200 పేజీల చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. భారత వ్యతిరేక నినాదాలు చేయడానికి జనాన్ని కన్హయ్య కుమార్ రెచ్చగొట్టాడని పోలీసులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ(బిజెపి) పార్లమెంటు సభ్యుడు మహీశ్ గిర్రి, అఖిల్ భారతీయ విద్యార్థి పరిషద్ ఫిర్యాదు తర్వాత వసంత్ కుంజ్ (ఉత్తర) పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపిసి సెక్షన్లు 124ఎ, 120బి కింద 2016 ఫిబ్రవరి 11న కేసు నమోదయింది. జెఎన్‌టియులో నిర్వహించనున్న ఆ ఈవెంట్ ‘జాతి వ్యతిరేకమని’ ఎబివిపి నుంచి ఫిర్యాదు అందాక, ఆ ఈవెంట్‌కు యూనిర్శిటీ పాలకవర్గం అనుమతిని రద్దు చేసినప్పటికీ ఆ ఈవెంట్ జరిగింది.
నిజాలు నిగ్గుతేలుతాయి : కన్హయ్య కుమార్
పోలీసులు రాజద్రోహం కింద దాఖలుచేసిన చార్జిషీటు ‘రాజకీయ ప్రేరణ’తో పెట్టిందని జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు దీనిని పెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. ‘ఈ చార్జిషీటు రాజకీయ ప్రేరణతో పెట్టింది. ఏది ఏమైనప్పటికీ వేగంగా విచారణ జరిపితే నిజం ఏమిటో బయటికి వస్తుంది. పోలీసులు సాక్ష్యంగా పెట్టిన వీడియోలను కూడా మేము చూడాలనుకుంటున్నాం’ అని కన్హయ్య విలేకరులకు చెప్పారు. ఇదిలా ఉండగా బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ వద్ద ‘రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్ ప్రసంగించారు.