HomeNewsBreaking Newsబొల్లికుంటలో పేదల గుడిసెలపైకి జెసిబిలు

బొల్లికుంటలో పేదల గుడిసెలపైకి జెసిబిలు

అధికారుల దాష్టీకం
వందలాది గుడిసెల ధ్వంసం
600 మంది అరెస్టు
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి
వరంగల్‌ జిల్లా బొల్లికుంటలో మంగళవారం తెలవారు జామున పేదల గుడిసెల పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడి చేశారు. వందలాది మంది పోలీసులు జెసిబిలతో తరలించి పేదల గుడిసెలను కూల్చివేసారు. ఉదయం 3గంటల నండి 8 గంటల వరకు పేదల కాలనీపై విరుచుకు పడ్డారు. గత కొంత కాలంగా ఈ ప్రభుత్వ భూమి పై కన్నేసిన రియల్‌ ఎస్టేట్‌,భూ కబ్జాదారులు స్థానిక ప్రజాప్రతినిధుల అండతో పక్కనే వుండి గుడిసెలను కూల్చి వేయించారు. పేదలు పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. మరోవైపు అడ్డు వచ్చిన వారిపై లాఠీ ఝులిపించారు. వందలాది గుడిసెలకు నిప్పుపెట్టి సుమారు 600 మంది పేదలను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఈ ఘటన వరంగల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట శి వారులో గల సర్వే నంబర్‌ 476, 484, 506లోని సుమారు 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సీపీఐ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నదని, గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని సీపీఐ ఆధ్వర్యంలో పేదలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు కూడా అందించారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వరంగల్‌ ఆర్డీవో ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు జే సీబీలతో అక్కడకు చేరుకున్నారు. పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారు. మరికొన్నింటికి నిప్పు పెట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీపీఐ నాయకులతోపాటు పేదలను అరెస్టు చేసి తీసుకెళ్లి మడికొండ పోలీసు స్టేషన్‌ లో నిర్భందించారు. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు అధికారులు, పోలీసులు కూల్చివేయడం, కొన్నింటికి నిప్పుపెట్టడంతో బొల్లికుంటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన పై సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు, జిల్లా కార్యదర్శి మేకల రవి ఆద్వర్యంలో బాధితులను పరామర్శించారు. బొల్లికుంట శివారులో గల ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు తొలగించడం దారుణమని అన్నారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ మహిళలు ఏడుస్తున్నా, ప్రాదేయపడినా కనికరించకుండా లాఠీచార్జి చేసి వ్యాన్లలో తరలించడాన్ని ఆయన ఖండించారు. దీనిపై వరంగల్‌ ఆర్డీవో కు వినతిపత్రం అందజేసారు.
వరంగల్‌ లో సిపిఐ రాస్తారోకో
ఖిలా వరంగల్‌ మండలం బొల్లిగుంట శివారు సర్వేనెంబర్‌ 476 ,484 ,506 నెంబర్లలో అంబేద్కర్‌ కాలనీలో గత సంవత్సరం క్రితం కేసీఆర్‌ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇల్లు లేని నిరుపేదలకు 58 జీవో ప్రకారం ప్రభుత్వ భూమిలో డబుల్‌ బె్‌డ రూములు కట్టిస్తామని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేసినారని అమలు కాని సమయంలో ఇల్లు లేని నిరుపేదలు గత సంవత్సరం క్రితం బొల్లిగుంటలో ఇల్లు వేసుకొని నివసిస్తున్నారని, గుడిసె వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ లాఠీచార్జ్‌ చేస్తూ గుడిసెలలో ఉన్న నిత్యవసర వస్తువులను బయటకు విచ్చలవిడిగా విసిరేస్తూ గుడిసెలను జెసిపిలతో కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోచమ్మ మైదాన్‌ సెంటర్‌ లో రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ వరంగల్‌ మండల కార్యదర్శి బుస్సా రవీందర్‌ ఆధ్వర్యంలో 500 మంది గుడిసె వాసులతో నిరసన కార్యక్రమం నిర్వహించి బొల్లిగుంటలో కాలబెట్టిన గుడిసె వాసులకు ఒక్కొక్కరికి ప్రభుత్వము ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం కింద ఇచ్చి అదే స్థలంలో 58 జీవో ప్రకారం పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టివ్వాలని డిమా్‌ండ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి, ఆర్‌ ఏన్‌ నగర్‌ కార్యదర్శి జన్ను రవి, కే ఎల్‌ ఎం నగర్‌ కార్యదర్శి పరికరాల రమేష్‌ , లావుడియా దస్రు,జిల్లా నాయకులు బూజ గుండ్ల రమేష్‌, మండల నాయకులు మస్కా సుధీర్‌,మహిళా సమాఖ్య మండల కార్యదర్శి బచ్చలి స్వప్న, షారుఖాన్‌.అంజద్‌, మార్కండేయ, సందాని, లడ్డు ప్రసాద్‌ ,బత్తుల సుప్రియ, లక్ష్మి, పద్మ ,సత్య, రాధ, రజిత ,500 మంది గుడిసె వాసులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments