ప్రజాపక్షం/సూర్యాపేటప్రతినిధి సిపిఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని వెంకటయ్య అంత్యక్రియలు బుధవారం సూర్యాపేట పట్టణంలోని 65వ జాతీయ రహదారి రాజీవ్‌పార్కు ఎదురుగా ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి. మంగళవారం వెంకటయ్య హైదరాబాద్‌లో మృతిచెందగా భౌతికకాయాన్ని సూర్యా పేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహానికి బుధవారం తరలించారు. వెంకటయ్య మరణవార్త తెలిసిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు, మహిళా సమాక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పార్టీ కార్యదర్శులు నెల్లికంటి సత్యం, పోటు ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెవిఎల్, అనంతుల మల్లేశ్వరీ, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, ధూళిపాళ ధనుంజయనాయుడు, కంబాల శ్రీనివాస్, యల్లంల యాదగిరి, గీత పనివారల సంఘం జిల్లా కార్యదర్శి కొండా కోటయ్య,రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి దొడ్డా వెంకటయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మస్ పుట్టా కిషోర్‌కుమార్ తదితరలు వెంకటయ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడసానుభూతిని తెలిపారు.
అన్నబాటలో నడిచిన ఆదర్శప్రాయుడు: జగదీష్‌రెడ్డి
కామ్రేడ్ బొమ్మగాని వెంకటయ్య తన అన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరమయోధులు, మాజీపార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం బాటలో పయనించి తన తుదిశ్వాస విడిచేవరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగి,పేదలపక్షాన నిలబడ్డ ఆదర్శప్రాయుడని కొనియాడారు. గీతవృత్తికి వన్నె తెచ్చేందుకు కృషిచేసిన దీశాలి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషిచేయాల్సిన బాధ్యత నేటి తరానికి ఉందన్నారు. వెంకటయ్య ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వెంకటయ్య పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కల్లుగీత వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన పోరాటయోధుడన్నారు. సహకార సంఘాల ఏర్పాటుకు ఆయన ఎంతో కృషిచేశారన్నారు.
పలువురు ప్రముఖుల నివాళి
ప్రజాపక్షం/ రంగారెడ్డి :‘బొమ్మగాని’ కుటుంబం అంటేనే కమ్యూనిస్టు కుటుంబంగా మారిందని, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని వెంకటయ్య ఆనాటి నైజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని పలువురు వక్తలు కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఆయన అభిమానుల సందర్శనార్థం బొమ్మగాని వెంకటయ్య భౌతికకాయాన్ని బుధవారం ఉదయం హైదరాబాద్, ఎల్.బినగర్‌లోని ఆయన రెండవ కుమారుని నివాసంలో ఉంటారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్భ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, పల్లా నరసింహారెడ్డి , బొమ్మగాని ప్రభాకర్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరమావత్ అంజయ్యనాయక్, సిపిఐ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్‌రావు, ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిఎల్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌లు కామ్రేడ్ బొమ్మగాని వెంకటయ్య పార్ధీవ దేహంపైన ‘ఎర్ర జెండా’ను కప్పి,పూల మాలతో నివాళ్లు అర్పించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ మాజీ సభ్యులు ,రిటైర్డ్ న్యాయమూర్తి ఎం.కాంతయ్య, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నండూరి కరుణా కుమారి, సిపిఐ నాయకులు శేఖర్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌గౌడ్, నవచేతన విజ్ఞాన సమితి కార్యదర్శి మోహన్ రెడ్డి, జనరల్ మేనేజర్ మధుకర్, కోశాధికారి ఉజ్జిని రత్నాకర్‌రావు, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, సిపిఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, సంస్థాన్ నారాయణపూర్‌మండల కార్యదర్శి, ఎంపిటిసి గాలయ్య, కోతులాపురం గ్రామ సర్పంచ్ పొట్ట సత్తయ్య తదితరులు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం బొమ్మగాని వెంకటయ్య భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేటకు తరలించారు.
అజ్ఞాత జీవితంలోనూ అనేక కష్టాలు : చాడ
బొమ్మగాని వెంకటయ్య నిరాడంబరుడని, ప్రజల కష్టాలనుచూసి సహించలేక అనేక ఉద్యమాలు చేశారని, స్వయంగా దళంలో పాల్గొన్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వెంకటయ్య నిండు నూరెళ్లు బతికిన నిరాడంబరుడని, ఉక్కుమనిషి అని కొనియాడారు. ఆయన చిన్నప్పుడే ఎర్రజెండా పట్ల ఆకర్షితులై ఆనాటి నైజాం రాక్షస రాజ్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూస్వాములు, వెట్టి చాకిరి, బానిసత్వాన్ని, ప్రజల కష్టాలను చూసి సహించలేక, అన్న బొమ్మగాని ధర్మభిక్షంతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. వెంకటయ్య స్వయంగా దళంలో చేరారని, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భార్యతో కలిసి దళంతో పని చేశారని, దళసభ్యునిగా కూడా ఉన్నారని తెలిపారు. అజ్ఞాత జీవితంలో ఆయన అనేక కష్టాలు పడ్డారని, అణచివేతలతో దినదినగండంగా బతకును ఎల్లదీశారని వివరించారు.