విధ్వంసానికి దారితీసిన ఓ పోస్టు
అల్లరిమూకపై పోలీసులు కాల్పులు, ముగ్గురు మృతి
బెంగళూరు: సామాజిక మాధ్యమంలో షేర్ చేసిన ఓ పోస్టు కర్నాటక రాజధాని బెంగళూరులో విధ్వంసం సృష్టించింది. ఈ వివాదాస్పద పోస్టు అల్లర్లకు దారి తీసింది. బెంగళూరు నగరంలో కాల్పులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు అల్లరిమూకలపై పోలీసులు కాల్పు లు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని పులకేషి నగర్‌లో జరిగిన ఘటనతో సంబంధమున్న 110 మందిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పాంట్ మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జరిగిన హింసాత్మక ఘటనలో 50 మంది పోలీసులు సహా డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. అల్లరిమూక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ నివాసం, పోలీస్‌స్టేషన్‌తో పాటు తదితరాలను లక్ష్యంగా చేసుకోవడంతో అల్లర్లు, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై సహించేది లేదని రాష్ర్ట ప్రభు త్వం కఠినమైన హెచ్చరికను జారీచేసింది. అయితే సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన నవీన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని కమిషనర్ పాంట్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్పందిస్తూ ఎంఎల్‌ఎ అఖండ శ్రీనివాసమూర్తి నివాసంపై, డిజె హల్లి పోలీస్‌స్టేషన్ దాడి, అల్లర్లను ఖండిస్తున్నామన్నారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశామని, ఇప్పటికే ప్రభుత్వం హింసను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుందన్నారు. పోలీసులు,
మీడియా వ్యక్తులు, సామాన్య పౌరులపై దాడి క్షమించగూడనిదని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదన్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి సామాజిక మాధ్యమంలోని ఓ పోస్టు విధ్వంసానికి దారి తీసింది. పోస్టుపై ఆగ్రహించిన వందలాది మంది వీరంగం సృష్టించారు. డిజి హల్లి పోలీస్ స్టేషాన్ని తగులబెట్టారు. అనేక పోలీసు, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. దుండగులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరపగా అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 50 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అల్లర్లతో రణరంగంగా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కర్ఫ్యూ కొనసాగుతోంది. అక్కడ 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు. బెంగళూరు నగరంతోపాటు కెజి హల్లి, డిజె హల్లిలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి.
బాధ్యుల నుంచి నష్టాన్ని రికవరీ చేస్తాం
హింసాకాండకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్ము స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. హింసలో ఎలాంటి నష్టం వాటిల్లినా అల్లరి మూకల నుంచే రికవరీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హింసకు పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని, నష్టాలను అంచనా వేసి జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రికవరీ చేస్తామని చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బెంగళూరు హింసాకాండ వెనుక కుట్రను బహిర్గతం చేస్తామని తెలిపారు.
ఆలయ రక్షణకు ముస్లిం యువకుల మానవహారం
సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ బెంగళూరు అల్లర్లకు దారితీసిన సమయంలోనే కొందరు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటుకున్నారు. మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగిన సమయంలో కొందరు ముస్లిం యువకులు ఓ ఆలయాన్ని రక్షించేందుకు మానవ హారంగా నిలిచారు. సిటీలోని డిజె హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఆలయంపై అల్లరిమూక దాడులు జరపకుండా ముస్లిం యువకులు చేయీచేయీ కలిపి మానవహారంగా నిలవడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరుహింసాత్మకం
RELATED ARTICLES