ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు సయ్యిద్ అజీజ్ పాషా
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ‘ద్వేషపూరిత శక్తులుగా’ మారి మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిన బుల్డోజర్ సంస్కృతి దేశానికి ప్రమాదకరమని ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలపై విద్వేష పూరిత దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేదిలేదని, లౌకిక, ప్రజాసామ్యవాదులందరు ఏకమై తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మైనారిటీలపై దాడులు, బుల్డోజర్ సంస్కృతికి నిరసిస్తూ అఖిల భారత తంజీమ్- ఏ -ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి అజీజ్ పాషా మాట్లాడుతూ బల్డోజర్ విధానంతో దేశంలో జీవించే పౌరుల ప్రాథమిక హక్కులను కేంద్ర, రాష్ట్రాలలోని బిజెపి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచమైన మత రాజకీయాలను సుస్థిరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు బుల్డోజర్లను ఆయుధాలుగా ఉపయోగించి, మైనారిటీల దాడులకు తెగబడుతూ ఇళ్లను కూల్చివేయడం గర్హనీయమన్నారు. వివిధ ఆరోపణలు వచ్చిన వారి ఆస్తులను బుల్డోజర్‌లతో ధ్వంసం చేయడం ద్వారా బిజెపి ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకుంటే, ఇక దేశంలోని న్యాయవ్యవస్థ ఉపయోగం ఏమిటని అజీజ్‌పాషా ప్రశ్నించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు, నిరుద్యోగం లాంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి దేశంలో మతకల్లోలాలను బిజెపి ప్రభుత్వం సృష్టిస్తుందని విమర్శించారు. మైనారిటీల హక్కులపై ప్రశ్నిస్తే, నిరసనలు తెలిపితే పోలీసులు అణచివేతకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయించి, బుల్డోజర్‌లతో బలవంతగా ఇళ్లను కూల్చివేసి, వారిని నివసించే ప్రాంతాల్లో లేకుండా యోగి సర్కార్
చేస్తుందని అజీజ్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల జీవించే హక్కులను ధ్వంసం చేయడమంటే రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయడమేనన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ, బిజెపి ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్ పటేల్, బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ చారి, ఇన్సాఫ్ నాయకులూ షంషుద్దీన్, గౌస్, ఎం.డి.సాలీం తదితరులు పాల్గొన్నారు.
బుల్డోజర్ సంస్కృతి దేశానికి ప్రమాదకరం
RELATED ARTICLES