కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి
సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్
ప్రజాపక్షం/హైదరాబాద్ బుల్‌డోజర్ రాజకీయాలను అడ్డుకునేదే ఎర్ర జెండా అని సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటని మండిపడ్డారు. వక్రీకరణలు, విద్వేష ప్రసంగాలతో బిజెపి దేశాన్ని పరిపాలిస్తోందన్నారు. కులమతాలతో సంబంధం లేకుండా, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కూడా ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా బిజెపి చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సిపిఐ (ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ‘ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు, తెలంగాణ విలీన దినోత్సవాలు’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బృందాకరత్ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు . ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు ఆనాడు బ్రిటీషర్లు, నిజాం, దేశ్‌ముఖ్ కు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేశారని, ఆ ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు. అనేక త్యాగాలతో కులమతాలకు అతీతంగా ఐక్యంగా జరిగిన పోరాట చరిత్రను మత ఘర్షణలుగా చిత్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి దాని అనుబంధ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. మణిపూర్ లోని ’డబుల్ ఇంజిన్ సర్కార్’ భారత-పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తతలు సృష్టించి, అమాయక గిరిజనులను ఊచకోత కోస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, కండ్ల ముందే తండ్రిని, సోదరుణ్ని చంపి, నగ్నంగా ఊరేగిస్తూ, సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినంలో పాల్గనేందుకు అమితాషా, రాహుల్‌గాంధీకి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన వారే సెప్టెంబర్ 17న హైదరాబాద్ వచ్చి వేడుకలు నిర్వహిస్తామనడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముందన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎమ్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, టీ జ్యోతి, సీనియర్ నాయకులు ఎస్ మల్లారెడ్డి, రఘుపాల్, పీఎస్‌ఎన్ మూర్తి, నంద్యాల నర్సింహారెడ్డి, సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు నాగలక్ష్మి, ఎమ్ మహేందర్, కెఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సాయుధ పోరాట చరిత్రను తెలియజేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ అనంతరం సుందరయ్య పార్కు నుండి చిక్కడపల్లి మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
బుల్డోజర్ రాజకీయాలుఎర్రజెండాతోనే అంతం
RELATED ARTICLES