వాన.. వరద… బురద
వరదనీటిలోనే మగ్గుతున్న బస్తీలు, కాలనీలు
ప్రజాపక్షం/హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మహానగరం పరిధిలో వరదల నుంచి బస్తీలు, కాలనీలు ఇంకా పూర్తికా కోలుకోలేదు. ఇప్పటికీ వరద నీటిలోనే బస్తీలు, కాలనీలు మగ్గుతున్నాయి. వరద నీటిని తొలగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (డిఆర్‌ఎఫ్) వాహనాల ద్వారా మోటర్లతో నీటిని బయటకు తీస్తున్నారు. మరో వైపు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం కూడా పర్యటించారు. వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రధానంగా పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను కూడా వారు పరిశీలించారు. మున్సిపల్ శాఖమంత్రి కెటి.రామారావు, హోంశాఖ మంత్రి మహ్మద్ మహముద్‌అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కెటిఆర్ సికింద్రాబాద్‌లోని లాలాపేట్,బోడుప్పల్, అంబర్‌పేట, నల్లకుంటల్లోని పలు కాలనీలలో పర్యటించారు. ప్రస్తు తం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది తక్షణ సహా యం మాత్రమేనని, పాక్షికంగా, పూర్తిగా ఇండ్లు నష్టపోయినవారికి మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కెటిఆర్ భరోసానిచ్చారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన షెల్టర్ సెంటర్‌ను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. అక్కడ అందుతున్న ఆహార,వైద్య సదుపాయాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అలాగే బోడుప్పల్ కార్పొరేషన్ తరఫున అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్యాంపును కూడా ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ఉప్పల్ నల్ల చెరువు వద్ద వరద ఉధృతికి దెబ్బతిన్న చెరువు అలుగు మరమ్మతు పనులను పరిశీలించారు. చెరువుకు సంబంధించిన మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. వర్షాలు కొంచం తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాలు మరింత వేగవంతమవుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ తక్షణ ఆర్థిక సహాయాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా తన సొంత నియోజవర్గమైన సనత్‌నగర్‌లోని
పలు ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్, రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని నల్లగుట్ట, సిలైన్, ఎఫ్ లైన్, బేగంపేట డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ వాడి తదితర ప్రాంతాలలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం తరపున రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని మంత్రి తలసాని అందజేశారు. శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో మేయర్ బొంతురామ్మోహన్, ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా వరద సహాయక పునరుద్ధరణ పనులను వారు పరిశీలించారు. వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బొంతురామ్మోహన్ తెలిపారు. మేయర్ బొంతురామ్మోహన్ మాట్లాడుతూ వరదలతో కొట్టుకొచ్చిన చెత్తా చెదారం, వ్యర్ధాలు, బురదతో నిండిన నాలాలలో 70 శాతం వరకు పునరుద్ధరించినట్లు తెలిపారు. రోడ్లపై పేరుకు పోయిన వ్యర్ధాలు, చెత్తను తొలగించేందుకు ఈ నెల18 నుండి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్టు వివరించారు. అంటువ్యాధుల నివారణకు పెద్దఎత్తున శానిటేషన్, బ్లీచింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌తో పాటు సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలు స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, సెల్లార్లలో నిలిచిన వరద నీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యను అధిగమించేందుకు 90 శాతం కాలనీల్లో డ్రైనేజీ, నాలా వ్యవస్థను అభివృద్ధి చేసి, పూడిక తొలగించినట్లు వివరించారు.
2 రోజుల పాటు మోస్తరు వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతోన్న అల్పపీడనం బుధవారం ఉదయం 08.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 24 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటలలో ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బాంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ ధ్రోణి వెంబడి పెనిన్సులర్ భారతదేశం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 కి.మీ. నుండి 5.8 కి.మీ. ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ వివరించింది.
బురదాబాద్!
RELATED ARTICLES