సిఎం పదవికి నితీశ్ రాజీనామా..
ఆ వెంటనే బిజెపి మద్దతుతో మళ్లీ ప్రమాణ స్వీకారం
పాట్నా: ఆర్జెడితో కూడిన ‘మహాఘట్బంధన్’ నుంచి వేరుపడిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఆ వెంటనే, బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, సిఎంగా మళ్లీ పదవీస్వీకారం చేశారు. మొత్తం మీద బీహార్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. సుమారు 18 నెలల క్రితం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి నుంచి బయటకు వచ్చి, ఆర్జెడితో కలిసి ‘మహాఘట్బంధన్’ను ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నితీశ్ యూటర్న్ తీసుకుంటారని, తిరిగి బిజెపి పంచన చేరతారని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. జెడియు వర్గాలు ఈ వార్తలను ఖండించినప్పటికీ, జాతీయ మీడియాలో నితీశ్ ‘దూకుడు’పై వరుస కథనాలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్‌తో, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవరన్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సిఎంలుగా బిజెపికి చెందిన విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరి కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షడు జెపి నడ్డా హాజరయ్యారు. బిజెపి, ఎల్జెపి, ఇతర పక్షాల మద్దతుతో నితీశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన బీహార్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది తొమ్మిదోసారరి. అంతకు ముందు ఆయన తన అధికార నివాసంలో పార్టీ ఎంఎల్ఎలతో సమావేశమయ్యారు. మహాఘట్బంధన్ను వీడి బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన నిర్ణయానికి పార్టీ ఎంఎల్ఎలు మద్దతు పలికారు. అనంతరం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించడం, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వెంటనే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. మొత్తం సీట్లు 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగ్గా, లాలూ ప్రసాద్ యాదవ్ సార్థ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) 75 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 74 స్థానాలు సంపాదించగా, జెడియు 43 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 122 మంది సభ్యుల మద్దతు అవసరం కావడంతో, బిజెపితో ఆర్జెడి జతకట్టింది. నితీశ్ సిఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్‌డిఎకు దూరమైన నితీశ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆర్జెడి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించడం లక్ష్యమని పేర్కొంటూ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. హఠాత్తుగా మనసు మార్చుకున్నారు. మహాఘట్బంధన్ నుంచి వైదొలిగారు. మళ్లీ బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగినన్ని సీట్లు సంపాదించలేకపోయినప్పటికీ, తన సిఎం పదవిని మాత్రం ఆయన రక్షించుకుంటూ వస్తున్నారు.బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం జెడియుకు 45 మంది, బిజెపికి 78 మంది ఎంఎల్ఎలు ఉన్నారు. హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు సభ్యులతోపాటు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడా నితీశ్‌కు మద్దతు ప్రకటించారు. కాగా, ఆర్జెడికి 79 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ (19), వామపక్షాలు (16)లతో కలిపి మహాఘట్బంధన్ బలం ప్రస్తుతం 114. అంటే మెజారిటీకి కేవలం 8 మంది సభ్యులు తక్కువ. ఏవైనా రాజకీయ సమీకరణలు ఆర్జెడి లేదా బిజెపికి వ్యతిరేకంగా మారితే నితీశ్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.
బీహార్ హైడ్రామాకు తెర
RELATED ARTICLES