అక్రమాలకు సహకరించే ఐఎఎస్‌లకే కీలక పదవులా?
బీహార్ అధికారుల తప్పుడు పనులతో ప్రజలకు ఇబ్బందులు
టిపిసిసి అధ్యక్షుడు ఎంపి రేవంత్‌రెడ్డి విమర్శ
ప్రజాపక్షం/ హైదరాబాద్ వందలాది ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో స్థానిక అధికారులకు కాకుండా బీహార్‌కు చెందిన ఐఎఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సిఎస్ సోమేశ్‌కుమార్, ఇన్‌చార్జ్ డిజిపి అంజనీకుమార్, కీలక పదవుల్లో ఉన్న ఐఎఎస్ అధికారులు జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, రజత్‌కుమార్, సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్ అందరూ బీహార్‌కు చెందిన వారేనని అన్నారు. వారికి ఒక్కొక్కరికి మూడు నుంచి ఆరు శాఖలను కట్టబెట్టారని ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీహార్ ఐఎఎస్‌లను రక్షణ వలయంగా చేసుకొని సిఎం కెసిఆర్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ పూర్వీకులు బీహార్‌కు చెందిన వారు కావొచ్చని, అంత మాత్రాన పరిపాలన మొత్తం వారి చేతిలో పెడతారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ర్టంలోని 157 మంది ఐఎఎస్, 152 ఐపిఎస్ అధికారులలో కేవలం బీహార్‌కు చెందిన వారే కీలక పదవులకు దొరికారా అని అన్నారు. దీంతో తెలంగాణ ప్రాంత అధికారులు పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సిఎస్ సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీకే పరిమితమని, కాని సిఎస్‌గా బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. పరిపాలనలో బీహార్ అధికారుల తప్పుడు పనులతో రాష్ర్ట ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని సిఎం కెసిఆర్ పదే పదే చెబుతున్నారని, ఇబ్రహీంపట్నంలో జరిగిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యలు ధరణి లోపాల వల్లే జరిగాయని అన్నారు. సిఎస్ సోమేశ్ కుమార్ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారిందన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకొని అవుటర్ రింగ్‌రోడ్ చుట్టూ లక్షలాది ఎకరాల భూమి గోల్మాల్ అయ్యాయని, బీహార్ ఐఎఎస్ కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ధరణి పోర్టల్ కారణంగా భూతగాదాలు ఏర్పడి కాస్త హత్యలకు కారణమవుతున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్‌కుమార్ జనరల్ ఎలక్షన్‌లలో అవకతవకలకు సహకరించినందుకు కెసిఆర్ ఆయనను జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్‌మార్ తొలగించారని, అందుకు నజరానాగా సిఎస్ పోస్ట్ ఇచ్చారని ఆరోపించారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు ఆరు శాఖలు ఇచ్చారని, డిజిపిగా ఉన్న మహేందర్‌రెడ్డిని సెలవుపై పంపించి, బీహార్‌కు చెందిన అంజనీకుమార్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. తాను ఇవన్నీ బయటపెడితే.. రాష్ర్ట ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి.. బీహార్ మంత్రి తనను విమర్శిస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.
మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడొద్దు
ఉన్నత స్థాయిలో పని చేస్తున్న అధికారులకు ప్రాంతీయతను అంటగట్టి, వారి మనోభావాలను దెబ్బతీసేలా కొంత మంది రాజకీయ నాయకులు మాట్లాడడం అప్రజాస్వామికమని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి వి.మమత అన్నారు.. సిఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ఐఎఎస్ అధికారులు బీహారీలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల జెఎసి తరుపున బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసులోని ఉద్యోగులు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, ఇతర ఉన్నత అధికారులు దేశంలోని ఏ రాష్ట్రంలో ఎంపికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ విధానాలకు అనుగుణంగానే పని చేస్తారని తెలిపారు. దీనిని అపార్థం చేసుకుని వక్రభాష్యంతో రాజకీయాలలో ఉన్న వ్యక్తులు అనుచితంగా పరుష పదజాలంతో మాట్లాడడం చాలా హేయమైన చర్య అని అన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై ఐఎఎస్ అసోసియేషన్ ఖండన
ఒక రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీసుల అధికారులను ఉద్దేశించి రాజకీయ నాయకులు చేసిన ప్రకటనలను తెలంగాణ ఐఎఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. అఖిల భారత సర్వీసుల అధికారులను అఖిల భారత సర్వీసు నిబంధనలు ఆధారంగా ఒక రాష్ట్రానికి కేటాయిస్తారని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టింగ్‌లు ఇస్తాయని పేర్కొంది. కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకొని వారు ఒక రాష్ట్రానికి చెందిన వారు అని చేసిన ప్రకటనలు పక్షపాత పూరితమైనవి, అఖిల భారత సర్వీసుపై అవగాహన లేనివిగా ఉన్నాయని అసోసియేషన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించింది. ఇది అధికారులు తమ అధికారిక బాధ్యతలను నిర్వహించడంలో చొరబాటు, జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రకటనలు వారి ప్రచారం కోసం అధికారులను అనవసరంగా అవాంఛనీయమైన అంశాలలోకి లాగినట్లుగా ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు , వివక్షపూరితమైన ప్రకటనలు చేయకుండా ఉండాలని రాజకీయ పార్టీ నాయకులను తెలంగాణ ఐఎఎస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
బీహార్ ఐఎఎస్‌ల రక్షణ వలయంలో సిఎం కెసిఆర్ పాలన
RELATED ARTICLES