ఐదేళ్లు దాటినా కదలని ఫైలు
బిసి నివేదికా సిఎం పేషీలోనే పెండింగ్
రాయితీల కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి?
వెనుకబడిన తరగతుల అసంతృప్తి
ప్రజాపక్షం/ హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో “బిసి ప్రత్యేక రాయితీ” దస్త్రం అటకెక్కింది. ప్రత్యేక రాయితీ కల్పనకు పరిశ్రమల, బిసి శాఖలు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన ద్రస్త్రం పురోగతి మా త్రం కనిపించడం లేదు. ఇంతకు బిసిలకు ప్రత్యేక రాయితీని అమలు చేస్తారా..? లేదా అనే అంశం పై ఐదేళ్లు దాటినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం పట్ల పలువురు బిసి వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా బిసి ప్రజాప్రతినిధులతో మంత్రులు చర్చించి ప్రభుత్వానికి అందజేసిన “బిసి నివేదిక” కూడా సిఎం పేషీలోనే పెండింగ్ ఉన్నది. స్వయం ఉపాధి, పలు సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బిసిలకు చెందిన దస్త్రాలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించకపోవడం పట్ల వివిధ బిసి సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక రాయితీ వల్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు, స్థల సేకరణలో 50 శాతం రాయితీ, రాయతీతో కూడిన విద్యత్ సరఫరా ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక పాలసీలో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక రాయితీలను కల్పించినట్టే బిసిలకు కూడా ఆ రాయితీలను వర్తింపజేయాలని 2015 సంవత్సరం నుంచి బిసి, పరిశ్రమల శాఖలకు పలువురు బిసి సంఘాలు వినతిపత్రాలు అందజేశాయి. ప్రధానంగా బిసిలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలను కల్పించాలని పరిశ్రమలు, బిసి శాఖలకు స్వర్ణ కాంతి ఇండస్ట్రీయల్ వెల్ఫేర్ ఫెడరేషన్ వినతిపత్రం అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 పరిశ్రమల పాలసీలో కూడా బిసిలకు ప్రత్యేక రాయితీలను పొందపర్చిన విషయాన్ని వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి బిసి సంక్షేమ శాఖ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందపర్చిన ప్రత్యేక రాయితీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని నాటి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి టి. రాధ 2015 జూన్ మాసంలో పరిశ్రమల శాఖకు లేఖ రాశారు. ఆ తర్వాత నాటి బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న కూడా తనకు అందిన వినతులను నాటి పరిశ్రమల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావుకు పంపించారు. పారిశ్రామిక పాలసీలో బిసిలకు ప్రత్యేక రాయితీలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని 2015 జూన్ 5న మంత్రి జోగు రామన్న స్వయంగా తన లెటర్‌హెడ్‌పై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. దీంతో “బిసి ప్రత్యేక రాయితీ” దస్త్రం కొంత ముందుకు కదిలింది. దీనిపై బిసి, పరిశ్రమల శాఖల మధ్య కొన్ని అంతర్గత సమావేశాలు, ఆ తర్వాత పలువురి అభిప్రాయాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత ఆర్థికపరమైన అంశంలో ఆర్థికశాఖ కొంత అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రత్యేక రాయితీల వల్ల బిసిలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు అవసరం లేదని, ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు వృథాగా ఉంటున్నాయని, స్వయం ఉపాధి, పలు ప్రోత్సహకాలకు కేటాయించిన నిదులతోనే ప్రత్యేక రాయితీకి నిధులను ఉపయోగించేందుకు వెసులుబాటు ఉందని నాడు జరిగిన సమావేశంలో పలువురు సూచించినట్లు తెలిసింది. ఇక్కడి వరకు ఆ దస్త్రం సాఫీగా ముందుకు కదిలినప్పటికీ ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించిన తర్వాతనే తుది నిర్ణయం వస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం గమనార్హం.