టికాయత్ సహా రైతు నేతలు ఇళ్ళకు..
నృత్యాలు, ఆనందహేల మధ్య ఘాజీపూర్‌కు వీడ్కోలు
ఘాజియాబాద్ : చరిత్రాత్మకమైన రైతు ఉద్యమం ముగించుకున్న రైతు నాయకులు 383 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తమ తమ ఇళ్ళకు బయలుదేరి వెళ్ళారు. సంయుక్త్ కిసాన్ మోర్చా ఐక్యవేదికలోని రైతు సంఘాలలో చురుకైన పాత్ర వహించిన బికెయు నాయకుడు టికాయత్ ఇతర రైతు సంఘాల నాయకులు ఇళ్ళకు బయలుదేరి వెళ్ళా రు. ఒక పండుగ వాతావరణంలో ఈ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం ఢిల్లీ ప్రవేశమార్గంలోని ఘాజీపూర్ సరిహద్దుల్లో బుధవారం జరిగింది. 11వ తేదీన రైతుల ఘర్ వాపసీ ప్రారంభమైనప్పటికీ రైతులందరూ వెళ్ళిన తర్వాత చివరిగా రైతు నాయకులు ఘాజీపూర్ సరిహద్దుల నుండి బయలుదేరారు. ప్రధానంగా ఈ ప్రాంతంలోనే రైతులు ఏడాదికాలంగా దేశం గర్వించదగ్గ ఘనమైన ప్రజా ఉద్యమాన్ని నడిపారు. ఈ ఘర్ వాపసీ ఉత్సవంలో ప్రధానంగా టికాయత్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు. వారంతా నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. దేశభక్తి గీతాలు, పంజాబీ, హర్యానా జానపద గీతాలు, రైతుల గొప్పతనాన్ని చాటిచెప్పే వ్యవసాయదారుల పాటలకు అనుగుణంగా వారు నృత్యాలు చేశారు. బుధవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ ప్రవేశమార్గం ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే లో రైతు నాయకులు హోమం చేశారు. హోమగుడంలో నెయ్యి, ధాన్యం పోసి దేవతలకు ఆరాధన చేశారు. రైతుల తాత్కాలిక ఆవాసాలు వెలసినది ఈ ప్రాంతంలోనే. గడచిన ఏడాది కాలంగా వారు అక్కడే నివసించారు. ఇప్పుడు రైతు నాయకులు ఉన్న ఆవాసాలన్నింటినీ తొలగించారు. తొలుత ఉదయం వాటిని ట్రాక్టర్లపై వేసి బయలుదేరడానికి సిద్ధం చేశారు. ఈ మేరకు వాటిని వీడియోలను టికాయత్ అందరికీ షేర్ చేశారు. తికాయత్ సహా ఇతర రైతు నాయకులు తమ తమ స్వస్థలాలకు బయలు దేరేముందు వారికి ఘనంగా వీడ్కోలు లభించింది. ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని కూడా వీడియోల ద్వారా అందరికీ టికాయత్ షేర్ చేశారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ముజఫర్నగర్జిల్లాలోని శిసాయిలూ గ్రామానికి ఘాజీపూర్ నుండి తికాయత్ ఆయన కుటుంబ సభ్యులు, ఇతర రైతు నాయకులు బయలుదేరి వెళ్ళారు. 13 నెలలపాటు వారి ఉద్యమ పోరాటం కొనసాగింది. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారు మడమతిప్పకుండా, ఎండా, వానా, చలీ, కరోనా వంటి బాధలను లెక్కచేయకుండా పోరాటం సాగించారు. ఈ సందర్భంగా టికాయత్ ట్వీట్ చేస్తూ, దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, కృ్తతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఇప్పుడు టికాయత్ భారతదేశ రైతు ఉద్యమంలో ఉన్న ప్రముఖ నేతల్లో ఒకరుగా పేరు పొందారు. ఉద్యమం జరిగినంతకాలం, రాకేశ్ తికాయత్ చిన్న తమ్ముడు బికెయు అధ్యక్షుడు నరేశ్ టికాయత్ “బిల్ వాపస్, ఘర్ వాపస్” అని నినాదం చేస్తూ ఉండేవారు. అదేవిధంగా కోరినపద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత 16 రోజులకు రైతు నాయకులు ఘర్ వాపసీ అయ్యారు. శిసాయిలూ వెళ్ళేముందు టికాయత్ బికెయు కేంద్ర కార్యాలయానికి వెళతారు. టికాయత్ రాక సందర్భంగా గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు. పూలు, తోరణాలతో అలంకరించారు. భారీ ఎత్తున మిఠాయిలు తయారుచేసి ఉంచారు. శిసాయిలూలోని కిసాన్‌ను అత్యద్భుతంగా అలంకరించారు.
బిల్ వాపసీ… ఘర్ వాపసీ
RELATED ARTICLES