దేశవ్యాప్త రాజకీయ ప్రచారానికి సిపిఐ పిలుపు
ఏప్రిల్ 14 నుండి పాదయాత్రలు ప్రారంభం
పుదుచ్చేరిలో పార్టీ జాతీయ సమితి సమావేశం తీర్మానం
అదానీ అక్రమాలపై జెపిసికి డి.రాజా డిమాండ్
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపిని ఓడించేందుకు భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) అంబేద్కర్ జయంతిరోజైన ఏప్రిల్ 14 నుండి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచారం ప్రారంభిస్తుంది. ఈ పాదయాత్రల ప్రచారం నెలరోజులపాటు మే 15వ తేదీ వరకూ కొనసాగుతాయి. పుదుచ్చేరిలో ఈనెల 26,27,28 తేదీలలో మూడురోజులపాటు జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఈ మేరకు తీర్మానం చేశాయి. సమావేశాలు ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం పుదుచ్చేరిలో జరిగిన పత్రికాగోష్ఠిలో పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సిపిఐ జాతీయ సమితి తీర్మానాలను మీడియాకు విడుదల చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు “బిజెపి హఠావో కీ బచావో” అనే ప్రధాన నినాదంతో ఈ రాజకీయ ప్రచారం ప్రారంభిస్తున్నట్లు డి.రాజా పాత్రికేయులకు చెప్పారు. బిజెపి ప్రభుత్వ దోపిడీ, దుర్వినియోగం నుండి దేశాన్ని రక్షించేందుకు, రాజ్యాంగ మౌలిక విలువలను సంరక్షించడంకోసమే ఏప్రిల్ 14 నుండి మే 15 వరకూ నెలరోజులు అన్ని రాష్ట్రాలలో పాదయాత్రలు తలపెట్టినట్లు చెప్పారు. ఈ పాత్రయాత్రల్లో భాగంగా కార్యకర్తలు ఎక్కడికక్కడ సమావేశాలు కూడా నిర్వహిస్తారని, బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం నింపుతారని చెప్పారు. దేశంలో విద్య, వైద్యం, ఆరోగ్యరంగం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ), ఇతర సామాజిక రంగాలకు నిధుల కేటాయింపు భారీగా పెంచాలని ఈ రాజకీయ ప్రచారం సందర్భంగా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని, తమ డిమాండ్లను ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు. గౌతమ్ అదానీ గ్రూప్ చేసిన అక్రమాలు, అవినీతి, ఆయనవల్ల జాతికి కలిగిన నష్టం, ఆయనకు సహాయం చేయడంలో ప్రభుత్వం పాత్ర వంటి విషయాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేయాలని కూడా డి.రాజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తుకు, దేశ ప్రజలకు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవని ఆయన అన్నారు. మహోన్నతమైన స్వాతంత్య్ర పోరాట ఉద్యమం ద్వారా వారసత్వంగా దేశం సంపాదించుకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, గణతంత్ర వ్యవస్థ మనుగడ కొనసాగించాలంటే ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయంగా, సైద్ధాంతికంగా ఓడించి తీరాల్సిందేనని ఆయన అన్నారు. దేశంలోని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యం కావాలని ఇప్పటికే భారత కమ్యూనిస్టుపార్టీ 24వ పార్టీ జాతీయ మహాసభ ఇప్పటికే పిలుపు ఇచ్చి నగారా మోగించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో బిజెపి సిద్దాంతాన్ని వ్యతిరేకించే భాగసామ్యపార్టీలమధ్య ఐక్యత ఈ మేరకు అనివార్యంగా ఒక ప్రగతిశీలరూపు తీసుకోవడం ఎంతో ముఖ్యమైనవిషయమని ఆయన అన్నారు.
పుదుచ్చేరికి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలి
పుదుచ్చేరికి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. పుదుచ్చేరి (పాండిచ్చేరి)లో మూడురోజులు జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు పార్టీ ఒక తీర్మానం చేసింది. అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎంఎస్) మార్చి 20వ తేదీన తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ ఉద్యమానికి మద్దతు ఇస్తూ పార్టీ జాతీయ సమితి మరో తీర్మానం చేసింది. ఎస్‌కెఎంఎస్‌కు సంఘీభావంగా కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ సంయుక్తంగా చేపట్టే ప్రచార కార్యక్రమాలకు కూడా మద్దతు ఇవ్వాలని సమావేశం తీర్మానం చేసింది. దీంతోపాటు ఇంకా పలు తీర్మానాలు చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని తీర్మాన విమర్శించింది. సిన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులకు రుణ విమోచన చర్యలు చేపట్టాలని, రైతులపై అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలని తదితర డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా ఈ ఉద్యమం తలపెట్టింది.
తొమ్మిదేళ్ళ పాలనలో దేశంలో
ప్రజాస్వామ్య వ్యవస్థకు అపార నష్టం చేసిన మోడీ
కాగా పుదుచ్చేరిలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ వనజ, పంజాబ్ రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యదర్శి కామ్రేడ్ బంత్ సింగ్ బ్రార్, పుదుచ్చేరి రాష్ట్ర కమ్యూనిస్టుసమితి కార్యదర్శి కామ్రేడ్ ఎ.ఎం.సలీమ్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా దేశ రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ఒక ముసాయిదా నివేదిక ప్రవేశపెట్టారు. అదేవిధంగా దేశంలో బిజెపి దుర్నీతిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పార్టీ చేపట్టవలసిన భవిష్యత్ ప్రచార కార్యక్రమాలు, సంస్థాగతమైన లక్ష్యాలను తన ముసాయిదా తీర్మానంలో డి.రాజా తొలుత ప్రతిపాదించారు. దేశంలో బిజెప ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తన ముసాయిదా ప్రతిలో పదునైన పదజాలంతో ఘాటుగా విమర్శించారు. తొమ్మిదేళ్ళ నరేంద్రమోడీ పరిపాలనలో బిజెపి దేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగించిందని, కులపరమైన అక్రమాలు, హింసాత్మక చర్యలు దేశంలో అనూహ్యంగా పేట్రేగిపోయాయని, మైనారిటీలపట్ల అతి దారుణమైన వివక్ష బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోందని డి.రాజా తన రాజకీయ తీర్మానం ముసాయిదా నివేదికలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన నిశితంగా విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు అమలు చేసే అన్ని సంక్షేమ, సామాజిక రంగ కార్యక్రమాలకు చేయవలసిన కేటాయింపులలో బిజెపి ప్రభుత్వం గణనీయంగా కోతపెట్టడం ద్వారా ఈ అమృత్ కాల్ లో తన ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం చేసిందని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) వంటి కీలకమైన సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులను కేంద్రం గణనీయంగా తగ్గించేసిందని డి.రాజా విమర్శించారు. దీనివల్ల దేశంలో నిరుద్యోగం అసాధారణమైన రీతిలో పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కాగా అంతర్జాతీయ పరిణామాలను కూడా డి.రాజా ప్రస్తావిస్తూ ఉక్రేన్ రష్యా మధ్య యుద్ధం శాంతియుతంగా పరిష్కారం కావాలని సిపిఐ కోరుకుంటోందని నివేదికలో పేర్కొన్నారు. నాటో కూటమి, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవడ ంవల్ల మరింత వినాశనానికి దారితీస్తుందని, సమస్య పరిష్కారం కాబోదని అన్నారు. మూడురోజుల సమావేశాల్లో చర్చల అనంతరం పార్టీ అనుసరించవలసిన భవిష్యత్ ప్రచార కార్యక్రమాలను, సంస్థాగతమైన లక్ష్యాలను తీర్మానించారు.
బిజెపి హఠావో దేశ్ కీ బచావో
RELATED ARTICLES