సిపిఐ ఆధ్వర్యంలో వాడవాడలా బిజెపి వ్యతిరేక ప్రచారోద్యమం
కాషాయకూటమిని తరిమికొట్టేందుకు కలిసిరండి
అన్ని పార్టీలకూ డి.రాజా పిలుపు
కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా మత ప్రాతిపదికన మన సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బిజెపిని అధికారం నుంచి తరిమికొట్టేందుకు దేశంలోని లౌకిక, ప్రజాతంత్ర శక్తులు చేతులు కలపాల్సిందిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చా రు. మూడు రోజుల సిపిఐ జాతీయ సమితి సమావేశం ఆదివారంనాడు కోల్‌కతాలో ప్రారంభమైన సందర్భంగా తొలి రోజు జరిగిన బహిరంగ సభలో రాజా ప్రసంగిస్తూ, కొత్త పౌరసత్వ చట్టం కేవలం ముస్లిమ్‌లకు మాత్రమే కాకుండా పేదలు, దళితులు, గిరిజనులు, సామాన్య ప్రజలందరికీ వ్యతిరేకమని అన్నారు. తమ పార్టీ ‘బిజెపి హఠావో…దేశ్ బచావో’ ప్రచారోద్యమాన్ని చేపడుతున్నదని వెల్లడించారు. “భారతదేశాన్ని చీల్చాలని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కోరుకుంటున్నది. ఇందుకోసం సిఎఎను వాడుకుంటున్నది. ప్రజల్లో విభజన రేఖ గీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్నది ఆ కూటమి కుట్ర. మోడీ, అమిత్‌షా చేస్తున్నది ఫాసిజమే. ఇది చాలా అమానుషం. ఈ దుష్టపన్నాగాన్ని ఎదిరించాలి. భారత రాజ్యాంగం పరివేష్ఠితమైనది. సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించింది. దాన్ని మనం కాపాడుకోవాలి. మనందరం భారతీయులమని రాజ్యాంగం చెపుతున్నది. మనం హిందువులం, ముస్లిమ్‌లం, క్రైస్తవులం అని రాజ్యాంగం చెప్పలేదు. భారత్‌ను హిందూరాజ్యంగా మార్చాలన్న బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ గేమ్‌ప్లాన్‌ను అడ్డుకోవడానికి అందరం కలిసిరావాలి. చేతులు కలపాలి. భారతదేశం కేవలం మోడీదో, అమిత్‌షాదో కాదు. సిఎఎ తరహా చట్టాన్ని అమలు చేస్తున్న ఐరోపా దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది. దేశప్రజలు అప్రమత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ‘బిజెపి హఠావో…దేశ్ బచావో’ ప్రచారోద్యమాన్ని చేపడుతున్నాం. ఇది ప్రతి రాష్ట్రంలోనూ, దేశంలోని ప్రతిమూలకూ దీన్ని తీసుకువెళ్తాం” అని డి.రాజా చెప్పారు. బహిరంగ సభ అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి సిపిఐ(ఎం), కాంగ్రెస్‌లు ఉమ్మడి పోరును జరిపే అవకాశాల గురించి ప్రస్తావించగా, పశ్చిమబెంగాల్‌లో పరిస్థితులు భిన్నంగా వున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో అందరం కలిసి పనిచేస్తామని, పార్లమెంటులో లౌకిక పార్టీల మధ్య సమన్వయం వుంటుందని చెప్పారు. ఫాసిజంను తాము ఉమ్మడి ముప్పుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా ఢిల్లీలోనూ, ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌లో కాల్పులు గురించి ప్రస్తావించగా, బెంగాల్‌లో కాల్పుల గురించి వచ్చిన ఆరోపణలపై అవగాహన లేదని, ఢిల్లీ ఘటన గురించి మాత్రం తనకు తెలుసునని చెప్పారు. మోడీ, అమిత్‌షాల రెచ్చగొట్టే ప్రకటనల ప్రత్యక్ష ఫలితమే ఢిల్లీలో కాల్పుల ఘటన అని రాజా వ్యాఖ్యానించారు.