ఐదేళ్లలో తొలిసారి మీడియా ముందుకు ప్రధాని మోడీ
బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి పాత్రికేయ సమావేశం
న్యూఢిల్లీ: సొంత భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో మోడీ మీడియా సమావేశంలో మాట్లాడటం ఇదే తొలిసారి. అయితే పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలకు బదులివ్వడానికి ఆయన నిరాకరించారు. విలేకరుల సమావేశం లో అమిత్ షా ప్రసంగించనున్నందున తాను ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోనని దాటవేశారు. ‘పార్టీ క్రమశిక్షణ జవానులం మేము. పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు మనతో ఉన్నారు’ అని మోడీ చెప్పా రు. ఎన్నికల్లో బిజెపి పనితీరు గురించి చెబుతూ అధికారంలోకి మళ్లీ వచ్చి ఐదేళ్లు పాలిస్తామన్నారు. కొంత సమయం తర్వాత ఇదే జరగనుందన్నారు. ఈ సందర్భంగా ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశమిచ్చిన ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ తన వైవిధ్యం, ప్రజాస్వామ్యంతో ప్రపంచాన్ని మెప్పించాలని అన్నారు. ప్రపంచంలో మని అతి పెద్ద ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజలకోసమే నేను ఆలోచిస్తున్నానంటూ ఎన్నికల ప్రచార సభల్లోని మాటలను గుర్తు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలపైనా మోడీ స్పందించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని చెప్పారు. బిజెపి తన మ్యానిఫెస్టోలో చేసిన వాగ్ధానాలు నెరవేరుస్తుందని మోడీ చెప్పారు. నిజాయితీతో కూడిన తమ ప్రభుత్వ పయనం 2014 మే 17 నుంచే మొదలయిందన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో బిజెపి చేపట్టిన వివిధ ప్రచార కార్యక్రమాలు, గత ఐదేళ్లలో బిజెపి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి వివరించారు.