అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు
జహంగీర్‌పురిలో మళ్ళీ తీవ్ర ఉద్రిక్తత
లేఖ రాసి అగ్నికి ఆజ్యం పోసిన బిజెపి
సుప్రీంకోర్టు తక్షణ జోక్యంతో నిలిపివేత
నోటీసులు కూడా ఇవ్వలేదు : స్థానికుల ఆవేదన
ఢిల్లీ : వాయువ్య ఢిల్లీ జహంగీర్‌పురి ప్రాంతంలో బిజెపి మళ్ళీ ఆజ్యం పోసింది. ఇప్పుడిప్పుడే చల్లారుతున్న ఉద్రిక్తతలను మరోసారి రెచ్చగొట్టింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరిట ఢిల్లీ ఉత్తర ప్రాంత మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డిఎంసి) సిబ్బంది బుధవారంనాడు జహంగీర్‌పురి ప్రాంతంలో పేదల నిర్మాణాలను బుల్‌డోజర్లతో కూల్చివేయడం ప్రారంభించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘోరాన్ని తక్షణం నిలిపివేయాలని కోరుతూ ‘జామియా ఉలేమా ఇ హింద్’ అప్రమత్తమై సుప్రీంకోర్టులో తక్షణ ప్రాతిపదికపై పిటిషన్ దాఖలు చేసింది. కూల్చివేతలు ఆపేయాలని వెంటనే సుప్రీకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులు తమకు అందలేదంటూ ఎన్‌డిఎంసి అధికారులు ఉత్తర్వుల ఆదేశాలను ఉల్లంఘించి రెండు గంటలపాటు ఎంపికచేసిన నిర్మాణాలపై బుల్‌డోజర్లతో విధ్వంసం సృష్టించారు. జహంగీర్‌పురిలో ఈనెల 16వ తేదీన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తించడంతో ఘర్షణలు,హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఆ క్రమంలోనే ‘ఆ ప్రాంతంలో అల్లరిమూకల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటిని కూల్చేయండి’ అంటూ ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఉత్తర ఢిల్లీ మేయర్‌కు లేఖ రాశారు. దాంతో ఎంసిడి బుధవారంనాడు బుల్ డోజర్లతో ) బయలుదేరి అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టి పేదల ఇళ్ళు కూల్చివేయడం ప్రారంభించారు. దీంతో మరోసారి ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాంతంలో ప్రజలు అక్కడ గుమిగూడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో వాదనకు దిగారు. తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని, కూల్చివేత చర్యలున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదని స్థానికులు వాపోయారు. నగర పాలక సంస్థ దుశ్చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ఢిల్లీ నగరంలో ఇలాంటి కూల్చివేత చర్యలు రోజువారీ ప్రాతిపదికపై జరిగేవే అని మేయర్ రాజా ఇగ్బాల్ సింగ్ సమర్థించుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కూల్చివేత ప్రక్రియ నిలిపివేస్తామన్నారు. బుధవారం ఉదయం ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని మోహరించారు. గడచిన శనివారంనాడు భజరంగ్ దళ్ కార్యకర్తలు శోభాయాత్రను మసీదు ఎదుట ఆపేసి నినాదాలు,డిజెలతో, కేకలతో భయంకర వాతావరణం సృష్టించారు. అదే మసీదు పక్కన ఉన్న కట్టడాలపై బుల్‌డోజర్లు ఒక్కసారిగా దాడికి దిగి కూల్చివేయడం ప్రారంభించాయి. దాంతో షాక్‌కు గురైన పేదలు, బాధితులు ఎటూ పాటు పోని స్థితిలో పడిపోయారు.మెల్లిగా తరువాత జనం గుమిగూడారు.
పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ
జహంగీర్‌పురి ప్రాంతంలో ఎంసిడి అక్రమ నిర్మాణాల పేరిట చేస్తున్న కూల్చివేతలపై ‘జామియా ఉలేమా హింద్’ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ సారథ్యంలోని ధర్మాసనం యుద్ధ ప్రాంతిపదికపై ఈ పిటిషన్‌ను విచారించి వెంటనే కూల్చివేత చర్యలు నిలిపివేయాలని, యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని తాత్కాలిక ఆదేశాలు స్టే ఆర్డర్ జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఈనెల 21న అంటే రేపు గురువారంనాడు విచారణ చేపడతామని కూడా ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది దుష్యంత్ దేశ్ జామియా ఉలేమా హింద్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు తీసుకున్న వెంటనే జస్టిస్ ఎన్ వి రమణ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు తామిచ్చిన ఆదేశాల విషయాన్ని తెలియజేశారు. అల్లర్లు చెలరేగిన జహంగీర్‌పురిలో కూల్చివేతల కార్యక్రమాన్ని తక్షణం నిలిపివేసేందుకు ఎన్‌డిఎంసి మేయర్‌కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు వెంటనే చేరవేయాలని ఆయన్ను కోరారు. పిటిషన్‌పై గురువారం విచారణ జరిపేందుకు ఆయన అంగీకరించారు. ఎలాంటి నోటీసులు లేకుండాఉద్దేశపూర్వక దాడి చేసిన పౌర ప్రభుత్వంపైన చర్యలు తీసుకోవాలని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ఇది వారి దృష్టిలో నిందితులపై చేసిన మతపరమైన దాడితప్ప మరొకటి కాదని పిటిషనర్ ఆరోపించారు. ఇప్పటికే ఆలస్యమైపోయిందని, ఇక జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ఉత్తర్వులను కోరుతూ దుష్యంత్ దేవ్ తొలుత ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేదా సెక్రెటరీ జనరల్‌ను ఈ బాధ్యతలకు నియమించి ఈ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు చేరేలా ఏర్పాటు చేశారు. ముస్లింల తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా హాజరయ్యారు.
బిజెపి ఆఫీస్,అమిత్‌షా ఇళ్ళను
బుల్‌డోజ్‌చేస్తే అల్లర్లు ఉండవ్‌ఃఆప్
ఢిల్లీ (ఉత్తర) నగరపాలక సంస్థ జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల పేరిట ఇళ్ళ కూల్చివేతను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇప్పుడిప్పుడే ఒకవైపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గుముఖంపట్టి శాంతి నెలకుంటున్న సమయంలో అగ్నికి ఆజ్యం పోశారని ఆమ్ ఆద్మీపార్టీ ధ్వజమెత్తింది. ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయాన్ని, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా నివాసాన్ని బుల్‌డోజ్ చేసేస్తే ఇక దేశంలో ఎప్పటికీ మతపరమైన అల్లర్లు, హింస ఉండబోదని ఆప్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రజలమధ్య సామరస్యాన్ని దెబ్బతీసి, సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకే బిజెపి కుట్రలు చేస్తోందని ఆప్ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రధానమంత్రి నరేద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ విధమైన కుట్రలకు పాల్పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి తన వీడియో సందేశంలో విమర్శించారు. బుల్డోజర్లతో హింస,దాదాగిరీలను అడ్డుకుంటామని బిజెపి చెబుతోంది, కానీ నిజానికి బిజెపియే దాదాగిరీకి పాల్పడుతోంది అని ఆయన విమర్శించారు. జహంగీర్‌పురిలో బిజెపి మతచిచ్చు,ఘర్షణలకు ఆజ్యం పోస్తోందని విమర్శించారు. రామనవమినాడు దేశంలో అనేకచోట్ల మతహింస రేపారని విమర్శించారు.
ఎంఐఎం విమర్శ
నిరుపేద ముస్లిం ప్రజలకు బతుకు లేకుండా చేస్తున్నారని ఎంఐఎం అధినేత ఒవైపీ విమర్శించారు. కూల్చివేతల పేరిట ఒక వర్గం మైనార్టీ ప్రజలపై ఉద్దేశపూర్వక దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.అక్రమ కట్టడాలపేరిట కూల్చివేతలు చేస్తున్నట్లు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, నోటీసులు జారీ చేయలేదని, ముందుగా సమాచారం కూడా ఇవ్వకుండా పేదలను వీథులపాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పాతికేళ్ళ బతుకులి కూల్చేశారు
“పాతికేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం, మా బతుకుల్ని బుల్‌డోజర్లతో కూల్చేశారు” అని ఎన్‌డిఎంసి దాడిలో ఇళ్ళు ధ్వంసమైన జహంగీర్‌పురి బాధితులు వాపోతున్నారు. మాలికా బీబీ అక్కడ ఒక దుకాణం నడుపుతోంది, “పాతికేళ్ళుగా నేను ఇక్కడ దుకాణం నడుపుతున్నాను, మాకు అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు, మా దుకాణాలు కూల్చివేస్తారన్న విషయం కూడా మాకు తెలియదు, మా బతుకుల్ని కూల్చేశారు, నాకు ఇద్దరు బిడ్డలు,వారు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు, ఇక మా కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది?” అని బీబీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా బుల్డోజర్ డ్రైవర్లు కూల్చివేతలు కొనసాగించారు, ఉత్తర్వులు తమ చేతికి అందలేదనే సాకుతో ఈ పని చేశారు’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర్వులకు ముందుగానే అనేక దుకాణాలను జహంగీర్‌పురిలో సిబ్బంది కూల్చివేశారు. “మా చెల్లెలు రహీమా (40) మసీదు పక్కనే దుకాణం నడుపుతోంది,కాఫీ, టీ అమ్ముతుంది,ఆమె దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఆమెకు ఉపాథి లేకుండా చేశారు,ఆమెకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు” అని నజ్మా (35) ఆవేదన వ్యక్తం చేశారు.