మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (అమ్మాయిని రక్షించండి.. అమ్మాయిని చదివించండి) అనే నినాదాన్ని మార్చివేసి, ‘బిజెపి నేతావోసే బేటీకో బచావో’ (అమ్మాయిని బిజెపి నేతల నుంచి రక్షించండి) అనాల్సిన పరిస్థితి నెలకొందన్న కాంగ్రెస్ విమర్శ సమంజసమే. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడంటూ ఓ మైనర్‌సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. వీరంతా ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు బ్రిజ్ భూషణ్‌పై పోస్కో, ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ, ఆయనను అరెస్టు చేయలేదు. అయితే, తక్షణమే బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 23న వారు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన రెజ్లర్లు, మే 28వ తేదీన, పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున ‘మహిళా మహాపంచాయత్’ను నిర్వహించాలని తలపెట్టారు. ఆ సమయంలో రెజ్లను అడ్డుకొని, వారిని అరెస్టు చేసిన పోలీసులు, జంతర్‌మంతర్ వద్ద ఉన్న దీక్షా శిబిరాన్ని కూడా తొలగించారు. అక్కడ ఉన్న టెంట్, కుర్చీలు, పరుపులు, మంచాలు, ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరికి, పోలీసుల అలసత్వానికి నిరసనగా, అంతర్జాతీయ వేదికలపై తాము సాధించిన పతకాలను గంగానదిలో పడేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు నరేశ్ తికాయత్‌తోపాటు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు వారిని నిలువరించి, ప్రభుత్వానికి డెడ్‌లైన్ ప్రకటించాలని కోరడంతో, రెజ్లర్లు తమ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఐదు రోజుల్లోగా చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. కాగా, ఇప్పటికే సిపిఐ జాతీయ అధ్యక్షుడు డి. రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితర నాయకులు స్వయంగా వెళ్లి రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ రెజ్లింగ్ యూనియన్ కూడా భారత్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. రెజ్లర్లపై జరుగుతున్న దమనకాండను ఖండించింది. ఇలావుంటే, హరిద్వార్ వద్ద పతకాలను గంగలో కలపాలన్న నిర్ణయం రెజ్లర్లదేనని బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానని అన్నారు.
బిజెపి నేతలకు ప్రత్యేక చట్టం ఉందా? : కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశంలో చట్టాలు ఆందరికీ ఒకే రకంగా వర్తించవా? బిజెపి నేతలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సింగ్‌ను ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. దేశమంతటా ఒకే విధానం అమలుకావలంటూ ‘కామన్ సివిల్ కోడ్’ను ప్రతిపాదిస్తున్న బిజెపి, తమ పార్టీ నేతల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ ఎంపి దీపేందర్ హూడా విమర్శించారు. బుధవారం ఆయన ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడాకారులతో ఫొటోలు తీసుకోవడానికి ముందుంటే ప్రధాని నరేద్ర మోడీకి రెజ్లర్ల ఆందోళన కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘దేశంలోని మహిళలను బిజెపి నేతల నుంచి రక్షించాలి.. బేటీకో బిజెపి నేతావోసే బచావో అని కొత్త నినాదాన్ని వినిపించాలి’ అన్నారు. రెజ్లర్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మరోసారి ప్రకటించారు.
‘బిజెపి నేతావోసే బేటీకో బచావో’
RELATED ARTICLES