సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడి
హైదరాబాద్: ఎన్‌డిఎ, యుపిఎ కూటములు రెండింటికీ మెజారిటీ తగ్గిన పక్షంలో బిజెపియేతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపేందుకు వామపక్షా లు సిద్ధంగా వున్నాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు. బుధవారంనాడు ఆయన పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చి న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎకి గానీ, కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎకు గానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజారిటీ రాకపోతే, ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర అవుతుందని అన్నారు. “అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు మంచి పాత్ర పోషించాల్సివుంటుంది” అని చెప్పారు. వామపక్షాలు ఎట్టిపరిస్థితుల్లోనూ బిజెపికి మద్దతు ఇవ్వడం గానీ, బిజెపి నుంచి మద్దతు తీసుకోవడం గానీ జరగబోదని తేల్చిచెప్పారు. “మేం బిజెపియేతర కూటమి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం” అని సురవరం చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి, చర్చలు జరిపేలా చేయడానికి తాము సిద్ధంగా వున్నామని తెలిపారు.