అందుకే మతతత్వ పార్టీ అని ప్రచారం చేస్తున్నారు
టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్: బిజెపిపై మతతత్వ పార్టీగా ప్రచారం చేసిన పార్టీలన్నీ పతనమయ్యాయని, టిఆర్‌ఎస్ కూడా పతనమవుతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. రాష్ట్రంలో బిజెపి విస్తరించడాన్ని చూసి సిఎం కెసిఆర్ భయపడుతున్నారని, అందుకే బిజెపి మతతత్వ పార్టీ అని ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఆ పార్టీలోని ప్రతి నాయకుడు బిజెపివైపు చూస్తున్నారన్నారు. ఉత్తమ్ ఇప్పటికైనా మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలన్నారు. టిఆర్‌ఎస్ ఆనేది పాత కాంగ్రెస్ లాంటిదని, ఆ పార్టీకి ఎలాంటి ఏజెండా లేదన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసిపోయాయని, ఆ రెండు పార్టీలు బిజెపికి భవిష్యత్తు లేదని చెప్పడం మ్యా చ్‌ఫిక్సింగ్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతోనే టిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి బిజెపిపై దాడి చేస్తున్నాయన్నారు. చింతమడక గ్రామానికి సిఎం కెసిఆర్ ఇచ్చే వరాలను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కూడా ఇవే వరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని చింతమడకలాగా చేయాలని ప్రతి గ్రామ సర్పంచ్ కూడా కెసిఆర్‌ను అడగాలని సూచించారు. మున్సిపల్ చట్టానికి భవిష్యత్తు లేదని, ఇది నిలబడదని, పరిస్థితులు దాటి తీర్మానాలు చేస్తే అవి అమలుకు సాధ్యం కాదన్నారు. మున్సిపల్ చట్టం లోపభూయిష్టంగా ఉందని, అందకే దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక ప్రజావ్యతిరేక పాలన సాగుతుందని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణం చేపట్టడం లేదన్నారు. సచివాలయ నిర్మాణాన్ని బిజెపి వ్యతిరేకిస్తోందన్నారు. రైతుబంధు అమలు కావడం లేద ని, రైతుల ఖాతాలలో డబ్బులు పడడం లేదని, ఈ స్కీమును రాష్ట్ర ప్రభుత్వం దండి కొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాని అవాస్ యోజన డబ్బులను తరలిస్తూ దీనిని అమలు చేయడం లేదని, అలాగే ఫసల్ బీమా, ఆయుష్మాన్‌భవ కార్యక్రమాలను అమలుచేయడం లేదని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక ప్రభుత్వమన్నారు. కర్నాటక అంశం మొత్తం దేశ ప్రజాస్వా మ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తుందన్నారు. అక్కడి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ సిఎం రాష్ట్రానికి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. స్పీకర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్-జెడిఎస్ కూటమి గెలిచే అవకాశం ఉన్నంత వరకు చర్చ కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కృష్ణసాగర్‌రావు, రఘునందన్‌రావు, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.