సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి
పార్టీ 23వ జాతీయ మహాసభ ప్రారంభం
కన్నూర్ (ఇకె నాయనార్ నగర్/ కేరళ) బిజెపిపై పోరాటానికి లౌకిక శక్తుల ఐక్యత అత్యవసరమని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పార్టీ 23వ జాతీయ మహాసభను బుధవారం ఇక్కడ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రస్తు తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు వామపక్షాల ఒకటిగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తు తం దేశంలో కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా పాలకు ల నుంచి లౌకిక వాదానికి, భారత రాజ్యాంగానికి విఘాతం కలుగుతోందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వామపక్షాలన్నీ ఒకటిగానిలిచి, బలాన్ని పెంచుకోవాలని సీతారాం ఏచూరి సూచించారు. బిజెపిపై సంఘటిత పోరాటం జరిపేందుకు కలిసి రావాల్సిందిగా వామపక్ష, లౌకిక ప్రజాస్వామిక శక్తులకు సిపిఎం ఆహ్వానం పలుకుతున్నదని అన్నారు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని, లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిపే పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించాలన్నది తేల్చుకోవాలని ఆయన కాంగ్రెస్‌ను, ప్రాంతీయ పార్టీలను కోరారు. రాజీలేని లౌకిక వాదంతోనే హిందూత్మ మత వాదాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని సీతారాం ఏచూరి అన్నారు. ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్ రూపొందించిన హిం దూత్వ అజెండాను అమలు చేయడానికి ఏకీకృత (యూనిటరీ) రాజ్యం అవసరమని, ఆ దిశగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన ఆరోపించారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఫలితంగా ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. కాగా, సిపిఎం జాతీయ మహాసభకు హాజరై న ప్రతినిధులకు ఆహ్వానం పలికిన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడుతూ, వామపక్షాలు 2021 ఎన్నికల్లో గెలిచి, రెండోసారి అధికారంలోకి రావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బిజెపి ఎంతో ఆర్భాటంగా ప్రచారం నిర్వహించిందని విజయన్ అన్నారు. అయితే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 15.01 శాతం ఓట్లు సంపాదించిన ఆ పార్టీ 2021 ఎన్నికల్లో 12.47 శాతం ఓట్లకే పరిమితమైందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన విజయన్ గుర్తుచేశారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ మహాసభలో 17 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు, 78 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 640 మంది ప్రతినిధులు, 77 మంది పరిశీలకులు పాల్గొంటున్నారు. ఈ నెల 10వ తేదీ, ఆదివారం ఈ మహాసభ ముగుస్తుంది.