HomeNewsBreaking Newsబిజెపికి ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండా

బిజెపికి ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండా

14వ తేదీ నుంచి జరిగే సిపిఐ జాతీయ మహాసభల్లో దేశ రాజకీయ పరిణామాలపై చర్చ : పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
అమరావతి:
దేశాన్ని అధోగతి పాల్జేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వామపక్ష ప్రజా తంత్ర పార్టీలు, లౌకిక శక్తులు ఐక్యం కావాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందని, దేశాన్ని సర్వనాశ నం చేస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగం విలయతాండం చేస్తోందని, ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారును గద్దెదించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశ సౌరభౌమత్వా న్ని కాపాడుకోవాలని ప్రజానీకానికి ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం ఆయన మీ-డియాతో మాట్లాడారు. ఈనెల 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్న మహాసభల్లో దేశ రాజకీయాలను మార్చేలా, బిజెపికి ప్రత్యామ్నాయం చూపడమే ప్రధాన అజెండాగా చర్చిస్తామని వివరించారు. మహాసభలకు దేశ, విదేశీ ప్రతినిధులతోపాటు వామపక్ష పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ మహాసభల విజయవంతానికి పార్టీ జాతీయ కార్యదర్శి, ఆహ్వా న సంఘం అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ, పార్టీ కార్యదర్శి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో విశేష కృషి చేయడాన్ని ఆయన అభినందించారు. అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పార్టీ శ్రేణులకు ఆయన జేజేలు పలికారు. దేశంలో సిపిఐ 1925లో ఏర్పడిందని, అప్పటి నుంచి గత 97 సంవత్సరాలుగా లౌకిక వాదం, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో ముందుకు సాగుతూ, ప్రజాపక్షం తరపున రాజీలేనిపోరాటాలను నిర్వహిస్తోందన్నారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదం పోకడలతో నేడు దేశానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ విచ్ఛిన్నం చేస్తూ, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రైవేటీకరణ విధానాలతో ప్రభుత్వ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోందని, లాభాల్లో ఉన్న సంస్థలను సైతం కారుచౌకగా అమ్మేస్తూ కార్మికులను బజారు పాల్జేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందంటూ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు దేశంలో అధికంగా ఉన్నారనీ, వారికి లబ్ధి చేకూర్చే పథకాలనుగానీ, సంక్షేమ కార్యక్రమాలనుగానీ చేపట్టడం లేదని, ఉన్న వాటిని సైతం నీరుగారుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా విక్రయిస్తూ, అంబానీ, ఆదానీలకు ఊడిగం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోందని, రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో క్షీణిస్తోందని విశ్లేషించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, ప్రజల్లో కొనుగోలు శక్తి అడుగంటి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే అర్హత బిజెపికి ఏ మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయన్నారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప, దేశానికి మోక్షం లేదని నొక్కిచెప్పారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, కొన్ని పార్టీలు బిజెపికి మద్దతిస్తున్నాయని పేర్కొంటూ ఆ పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్విరామ పోరాటాలు కొనసాగిస్తున్నాయన్నారు. కాశాయ పార్టీ నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని, ఈ జాతీయ మహాసభల్లో బిజెపికి ప్రత్యామ్నాయ చూపడమే ప్రధాన అజెండాగా చర్చ జరుగుతుందని వివరించారు. ప్రజాస్వామ్యంలో కొత్తగా పార్టీలు పెట్టుకునే హక్కు అందరికీ ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా రాజా బదులిచ్చారు. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ భారతీయ రాష్ర్ట సమితి (బిఆర్‌ఎస్‌) పార్టీ విధి విధానాలను పరిశీలిస్తున్నామని మరొక ప్రశ్నకు బదులిచ్చారు. సిపిఐ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు 17 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని పార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పల్లవ్‌సేన్‌ గుప్తా తెలిపారు. రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, క్యూబా, గ్రీస్‌, ఫ్రాన్స్‌, టర్కీ, పోర్చుగ్రీస్‌, నేపాల్‌, బ్రిటన్‌ తదితర దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్‌కుమార్‌ అంజన్‌ మాట్లాడుతూ ఈ మహాసభలు అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకుంటామన్నారు. మోడీ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణ చేస్తూ గద్దె దించే విషయమై మహాసభల్లో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తొలుత కె.రామకృష్ణ మాట్లాడుతూ, జాతీయ మహాసభల సందర్భంగా వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారన్నారు. ఆహ్వన సంఘ అధ్యక్షులు కె.నారాయణ మూడు రోజుల నుంచి విజయవాడ కేంద్రంగా ఉంటూ, సభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, ఎపి రాష్ర్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments