లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకమైతే అది సాధ్యమే
అవినీతి, మతోన్మాదంలో గుజరాత్ మోడల్ రాష్ట్రం
విశాఖ బహిరంగ సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం
విజయవంతంగా ముగిసిన పార్టీ
జాతీయ సమితి సమావేశాలు
ప్రజాపక్షం/ విశాఖపట్నం
మోడీ, అమిత్‌షా సారథ్యంలోని బిజెపికి అంతిమ ఘడియలు దాపురించాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు సంకేతమని చెప్పారు. గత నాలుగున్నర ఏళ్లల్లో ప్రధాని మోడీ సెమీ ఫాసిస్టు పాలన చేశారని, దేశం ఆర్థికంగా సంక్షోభంలోని జారుకుందని, కార్పొరేట్ శక్తుల ఆదాయం అపరిమితంగా పెరిగితే పేదలు మరింత దరిద్రులుగా మారిన తరుణంలో బిజెపి సర్కారును గద్దె దించటానికి లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు ఐక్యతను పాటించి, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. బిజెపియేతర పక్షాలు ఒక తాటిపైకి వస్తే బిజెపి తెరమరుగుకావడం అసాధ్యమేమీ కాదని అభిప్రాయపడ్డారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఇటీవల మూడు రాష్ట్రాల్లో గద్దె దిగిన బిజెపిని కేంద్రంలో గద్దె దింపాలన్నారు. నాలుగు రోజులపాటు విశాఖలో జరిగిన జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా శుక్రవారం జైల్రోడ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గుజరాత్ మోడల్ పేరిట ప్రచారం చేసి ప్రజలను మోసగించారన్నారు. అనేక రాష్ట్రాలకంటే అభివృద్ధితో గుజరాత్ వెనుకబడి ఉందన్నారు. మతోన్మాదం, అవినీతి గుజరాత్లో మోడల్‌గా నిలిచాయన్నారు. కోర్టు, న్యాయస్థానాలపై ఒత్తిడి చేయడమే గుజరాత్ మోడలా? అని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల్లో బిజెపిని తిరస్కరించిన ప్రజలు దేశవ్యాప్తంగా తిరస్కరించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ధనిక వర్గాలకు, కొర్పొరేట్ శక్తులకు తోట్పాటునిచ్చే మోడీ ప్రభుత్వం దేశంలో ధరల పెరుగుదల, అనారోగ్యం, నిరుద్యోగంపై దృష్టి సారించడంలేదన్నారు. సిబిఐ, ఆర్‌బిఐలను నిర్వీర్యం చేసి ఆర్థిక రంగాలను చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. వర్గ దోపిడీనుంచి దారిద్య్రం నుంచి ప్రజలు బయటపడాలంటే సోషలిజమే మార్గమని, ఆ దిశగా కార్మికులు, కష్టజీవులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ, కేంద్రంలో డెకాయిట్ల పాలన కొనసాగుతోందని, మోడీ సర్కారే మాఫియా, రౌడీలా మారిందని విమర్శించారు. మరో కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, మోడీ దేశ ప్రజలకు సేవకుడు కాదని, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని అన్నారు. జాతికి నెహ్రూ అంకితం చేసిన ప్రభుత్వరంగ సంస్థలను ధ్వసంచేసేందుకే ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతిఅయోగ్‌ను తెచ్చారన్నారు. దేశంలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే మోడీకి మతం మందిర్ తప్ప మరొకటి కనిపించడంలేదన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శులు అమర్జిత్ కౌర్, అతుల్ కుమార్అంజన్, పల్లబ్‌సేన్ గుప్తా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా, జెఎన్‌యు మాజీ అధ్యక్షులు కన్హయ్‌కుమార్, సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కన్హయకుమార్ ఆలపించిన దేశభక్తి గేయం అందరినీ ఆలోచింపజేసింది.