ప్రజల ఆకాంక్ష మేరకే సెప్టెంబర్ 17ను ‘ప్రజాపాలన దినోత్సవం’గా నిర్వహిస్తున్నా : సిఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ భౌగోళిక స్వరూపం
ప్రజాపక్షం/హైదరాబాద్
నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన మేరకు ‘సెప్టెంబర్ 17ను’ ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే తప్ప ప్రజాహితం కాబోదని, ఇందులో తమ స్వార్థం లేదని, కాంగ్రెస్ పార్టీ కోసమో నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఐక్యతను, సమైక్యతను దెబ్బతీసేలా ‘సెప్టెంబర్ 17’ ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరానిదన్నారు. సాయుధ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేశారని, సర్వం కోల్పోయి లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదని ‘నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని’ సిఎం గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుందని, ఈ పిడికిలి పోరాటానికి సింబల్ అని, ఇందులో తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు,మతాలు, కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఉన్నదని వివరించారు. గడిచిన పదేళ్లలో గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 17ను’ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును) రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘ప్రజా పాలన దినోత్సవం’ ను హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతీయ జెండాను సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ‘ఓ నిజాం పిశాచమా… కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని… తీగలను తెంపి అగ్నిలో దింపినావు… నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సిఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘76 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షరీకరించిన కవితానినాదం ఇది. యోధులు ఒక వైపు, వీరులు మరోవైపు , నిజాం నిరంకుశ రాజును, ఆ నాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి ,తెలంగాణ బానిస సంకెళ్లను తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17’. ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు’ అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి కొమురయ్య అని అన్నారు. ‘సెప్టెంబర్ 17’ తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజని, ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలనే అంశంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, కొందరు విలీన దినోత్సవమని, మరి కొందరు కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారని వివరించారు. లోతైన ఆలోచన తర్వాత సెప్టెంబర్ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’ గా జరుపుకోవడం సముచితంగా ఉంటుందని భావించామన్నారు. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి,ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారని, ఇది తెలంగాణ ప్రజల విజయమని, ఇందులో రాజకీయాలకు తావులేదని, రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నియంత పాలనలో మగ్గిన తెలంగాణ
గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ఆ బానిస సంకెళ్లను తెంచడానికి తమకు స్ఫూర్తి సెప్టెంబర్ 17 అని సిఎంరేవంత్ రెడ్డి అన్నారు. గజ్వేల్ గడ్డ మీద 2021 సెప్టెంబర్ 17 నాడు ‘దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా’ మోగించామని, 2023 డిసెంబర్ 3న తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో తమకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమేనని అన్నారు. తమ ఆలోచన, తమ ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని,అందుకే ఈ శుభ దినాన్ని ‘ప్రజా పాలన దినోత్సవం’ గా అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ అస్థిత్వమంటే.. కుటంబ అస్థిత్వం
తెలంగాణ సంస్కృతంటే తమ ఇంటి సంస్కృతి అని, తెలంగాణ అస్థిత్వమంటే తమ కుటుంబ అస్థిత్వమని గత పాలకులు భావించారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నదని వారు భ్రమించారని, మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్ధేశం వారికి లేదని విమర్శించారు. నిజాంను మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం వారు విస్మరించారన్నారు. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం’ అని అన్నారు.
రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం..
గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నామని, యువత భవితకు పెనుసవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహారిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటిలో ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు. మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘ఫ్యూచర్ స్టేట్”గా బ్రాండ్ చేస్తున్నామని, పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నమన్నారు. మూసీ సుందరీకరణ హైదరాబాద్ రూపు రేఖలను మార్చివేస్తుందనడంలో సందేహమే లేదని, ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని, వేలాది మంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామన్నారు.
ప్రకృతిని కాపాడే యజ్ఞమే ‘హైడ్రా’
హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదని, తన స్వార్థం లేదని, అదొక పవిత్ర కార్యమని, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞంలాంటిదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగబోదని స్పష్టం చేశారు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందని, ఇది తన భరోసా అని అన్నారు. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ‘ఫ్లడ్స్ సిటీ’గా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళ పాలకుల పాపమే అని విమర్శించారు.
ఆరు నెలల్లో రూ.18 వేల కోట్లతో రుణమాఫీ
ఆరు నెలల వ్యవధిలో సుమారు రూ. 18 వేల కోట్ల రూపాయలు, 22 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర దేశంలో మరెక్కడైనా ఉన్నదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చని, ఆ సమస్యలను కూడా పరిష్కరించి, ప్రతి ఒక్క అర్హునికీ రుణమాఫీ లబ్ధి పొందేలా చేస్తామని హామీనిచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. విదేశాల్లో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల ఇవ్వాలని నిర్ణయించామని, వారి పిల్లలకు గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నామన్నారు. గల్ఫ్ కార్మికులతో పాటు ఇతర దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వారి సమస్యలను వినడానికి, వాటిని సత్వర పరిష్కారానికి ప్రజావాణిలో భాగంగా, ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి కేంద్రం’ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి, ఒక కమిటీని ఏర్పాటు చేసి, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
తెలంగాణ ప్రజలే రాష్ట్ర ప్రస్థానానికి నావికులు
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి. యువ వికాసానికి, మహిళా స్వావలంబనకు, రైతు సంక్షేమానికి, బడుగు బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక ఉన్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సిఎం రేవంత్ రెడ్డి భరోసనిచ్చారు. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో మహనీయుల త్యాగఫలాలు తమకు గుర్తుంటాయని, నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా తమ పాలన సాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులని, వారి ఆలోచనలే తమ ఆచరణ. వారి ఆకాంక్షలే తమ కార్యాచరణ అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు సిఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళ్లు అర్పించారు.