నవంబర్ 4 3 మధ్య ఆప్షన్లు
జీతాల బిల్లు రూ.7వేల కోట్లు తగ్గుదల
రెండేళ్లలో లాభాల బాట: ఎండి పుర్వార్
న్యూఢిల్లీ: నష్టాల బాటపట్టిన ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ఆమోదించాక ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(విఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టింది. దీంతో 70వేల నుంచి 80వేల వరకు సిబ్బంది ఈ విఆర్‌ఎస్‌ను ఎంచుకోనున్నారని తెలుస్తోంది. దీం తో జీతాల బిల్లులో రూ. 7వేల కోట్ల వరకు ఆదా కావొచ్చని భావిస్తున్నారు. ఈ విఆర్‌ఎస్ స్కీము నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3వరకు తెరచి ఉంటుందని బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పికె పుర్వార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. విఆర్‌ఎస్ ఆఫరింగ్‌ల గురించి ఉద్యోగులకు తెలుపాల్సిందిగా ఫీల్డ్ యూనిట్లకు ఆదేశాలు ఇదివరకే ఇచ్చినట్లు కూడా చెప్పారు. మొత్తం 1.50 లక్షల ఉద్యోగుల్లో విఆర్‌ఎస్‌కు లక్షమంది అర్హులని పుర్వార్ చెప్పారు. ‘బిఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం అందిస్తున్న ఉత్తమ విఆర్‌ఎస్ ఆఫర్ ఇదని, దీనిని ఉద్యోగులు పాజిటివ్ మైండ్‌తో చూడాలి’ అని ఆయన చెప్పారు. ‘బిఎస్‌ఎన్‌ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకారం డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు పోస్టయిన ఉద్యోగులు సహా బిఎస్‌ఎన్‌ఎల్‌లోని శాశ్వత ఉద్యోగులు, 50 ఏళ్ల పైబడినవారందరూ ఈ స్కీమ్ కింద రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అర్హులైన ఉద్యోగులందరికీ సర్వీసులో పూర్తిచేసిన ప్రతి సంవత్సరానికి 35 రోజుల జీతం, పదవీ విరమణచేశాక 25 రోజుల జీతం ప్రతి ఏడాదికి లెక్కించి ఎక్స్ ఇవ్వనున్నారు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటిఎన్‌ఎల్)కూడా ఉద్యోగులకు విఆర్‌ఎస్‌ను అమలుచేసింది. గుజరాత్ మోడల్ ఆధారంగా ఉద్యోగులకు 2019 డిసెంబర్ 3 వరకు ఈ స్కీము తెరచి ఉంచుతారు. ఎంటిఎన్‌ఎల్ ఇటీవల ఉద్యోగులకు జారీచేసిన నోటీసులో ‘2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, ఆపైబడిన వయస్సు ఉన్న పర్మనెంట్ ఉద్యోగులందరూ విఆర్‌ఎస్ స్కీమ్‌ను వినియోగించడానికి అర్హులు’ అని పేర్కొంది. నష్టాల్లో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం గతనెల రూ.69,000 కోట్ల రివైవల్ ప్యాకేజీని ఆమోదించింది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న ఆస్తులను నగదు చేసుకుని విఆర్‌ఎస్ ఉద్యోగులకు ఇవ్వనుంది. తద్వారా సంస్థను రెండేళ్లలో లాభాల్లోకి తేవాలనుకుంటోంది. ముంబయి, న్యూఢిల్లీలో సేవలందిస్తున్న ఎంటిఎన్‌ఎల్‌ను, దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌లో కలిపేయాలన్న ప్లాన్‌ను కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రెస్క్యూ ప్యాకేజీ కింద ఇచ్చే దాంట్లో రూ. 20,140 కోట్లు 4జి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి, స్పెక్ట్రం కేటాయింపుకు చెల్లించే జిఎస్‌టికి రూ. 3,674 కోట్లు, సావరిన్ గ్యారంటీ మీద రూ. 15,000 కోట్ల రుణాన్ని కంపెనీ సేకరించడం, విఆర్‌ఎస్‌కు ప్రభుత్వం రూ.17,160 కోట్ల నిధు లు ఇవ్వడం, రిటైర్‌మెంట్ లయబిలిటీల కింద మరో రూ. 12,768 కోట్లను ఇవ్వడం ఉన్నాయి. రుణాల పునర్నిర్మాణం, ఇతర ఖర్చులు భరించేందుకు సావరిన్ బాండ్ల జారీని చేపట్టనున్నారు. ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే ఆ బాండ్లను ఇవ్వనున్నారు. రానున్న మూడేళ్లలో రూ. 37,500 కోట్ల ఆస్తులను నగదుచేసుకోవాలని బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ భావిస్తున్నాయి. గత 10 ఏళ్లలో తొమ్మిదేళ్లుగా ఎంటిఎన్‌ఎల్ నష్టాల్లో ఉంది. బిఎస్‌ఎన్‌ఎల్ కూడా 2010 నుంచి నష్టాల్లో ఉంది.