న్యూఢిల్లీ: మొత్తం రూ.89,047 కోట్లతో బిఎస్‌ఎన్‌ఎల్ మూడో పునరుద్ధరణ ప్యాకేజీ కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో ఈక్విటీ ఇన్ఫ్యూషన్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ కోసం 4జి, 5జి స్పెక్ట్రమ్ కేటాయింపులు ఉన్నాయని అధికారికంగా వెలువడిన ఒక ప్రకటనను ఉటంకిస్తూ పిటిఐ తెలిపింది. అలాగే, బిఎస్‌ఎన్‌ఎల్ అధీకృత మూలధనం 1,50,000 కోట్ల రూపాయల నుండి 2,10,000 కోట్ల రూపాయలకు పెంచనున్నారు. రూ. 46,338.6 కోట్ల విలువైన ప్యాకేజీలో ప్రీమియం వైర్‌లెస్ ఫ్రీక్వెన్సీల 700 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ఉంది. రూ. 26,184.2 కోట్ల విలువైన 3300 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో 70 ఎంహెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీలు, రూ. 6,564.93 కోట్ల విలువైన 26 జిహెచ్‌జెడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలు, రూ. 9,428.2 కోట్ల విలువైన 2500 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లతోపాటు, ఇతర వస్తువులకు రూ. 531.89 కోట్లు కేటాయించారు. స్పెక్ట్రమ్ కేటాయింపు బిఎస్‌ఎన్‌ఎల్ పాన్-ఇండియా 4జి, 5జి సేవలను, వివిధ కనెక్టివిటీ ప్రాజెక్ట్ల క్రింద గ్రామీణ, ఇప్పటి వరకూ ఈ సౌకర్యం లేని గ్రామాలలో 4జి కవరేజీని, హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఫికస్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యుఎ) సేవలను అందించడానికి, పబ్లిక్ నెట్‌వర్క్ సేవలు విస్తృతపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం 2019లో బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ కోసం రూ. 69,000 కోట్ల విలువైన మొదటి పునరుద్ధరణ ప్యాకేజీని అందించింది. 2022లో రూ. 1.64 లక్షల కోట్ల విలువైన రెండవ ప్యాకేజీని ప్రకటించారు. ఈ రెండు ప్యాకేజీల ఫలితంగా, బిఎస్‌ఎన్‌ఎల్ మొత్తం రుణం రూ.32,944 కోట్ల నుంచి రూ.22,289 కోట్లకు తగ్గింది. తాజా ప్యాకేజీతో బిఎస్‌ఎన్ పరిస్థితి మరికొంత మెరుగుపడే అవకాశం ఉంది.
బిఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణకురూ.89,047 కోట్లతో ప్యాకేజీ
RELATED ARTICLES