HomeNewsTelanganaబిఆర్‌ఎస్‌ అస్థిత్వం ప్రశ్నార్థకం

బిఆర్‌ఎస్‌ అస్థిత్వం ప్రశ్నార్థకం

లోక్‌సభ లోపు లేక ఎన్నికల తరువాత కనుమరుగు
రాజకీయ వర్గాల్లో ఊపందుకున్న చర్చ
చట్టసభల సభ్యులు పక్కచూపులు చూస్తున్న వైనం
ప్రజాపక్షం/హైదరాబాద్‌
భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) అస్థిత్వం రాష్ట్రంలో ప్రశ్నార్థకమైంది. సగం జిల్లాల్లో శాసనసభ ఎన్నికల్లో ప్రాతనిధ్యం కోల్పోయిన, దశాబ్దంపాటు ఏకచక్రాధిపత్యంగా పాలన సాగించిన పార్టీకి భవిష్యత్తు అంధకారంగా మారడంతో వచ్చే లోక్‌సభలోపా లేక ఎన్నికల తర్వాతనా… కనుమరుగైతదన్న చర్చ రాజకీయ వర్గాలలో ఊపందుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో (2018), ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపితో పరోక్ష అవగాహన కుదుర్చుకున్న బిఆర్‌ఎస్‌లో దాని భవిష్యత్తుపై ఆశలు పెంచుకోలేని స్థితి నెలకొన్నది. చట్టసభల సభ్యులు పక్కచూపులు చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌, అటు బిజెపి వారికి ప్రత్యామ్నాయాలుగా గోచరిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు, మరికొందరు శాసనసభ, శాసనమండలి సభ్యులు హస్తవాసిని చూసుకున్నారు. శాసనసభలోని బిఆర్‌ఎస్‌ “త్రిమూర్తులు’ మధ్య రాజకీయ ఏకాభిప్రాయం లేదు. పారిశ్రామిక, వ్యాపార, ఆర్థిక
లావాదేవీలున్న చట్టసభల సభ్యులు కొందరు బిజెపివైపు బలంగా మొగ్గుచూపుతున్నారన్నది యదార్థం.
కేంద్రస్థాయిలో బిజెపి నాయకత్వం బిఆర్‌ఎస్‌వైపు దృష్టి సారించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి తోసిపుచ్చిన, బిఆర్‌ఎస్‌ కాళ్లబేరానికి వచ్చినా కలిసేదిలేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ వ్యంగ్యంగా వ్యక్తీకరించినా సమస్యను దాటవేసే యత్నమే. బిజెపితో మిత్రపక్షంగా సాగిన రోజుల్లో ఆ తరువాత సంప్రదింపుల్లో ఏనాడూ బిఆర్‌ఎస్‌ రాష్ట్ర బిజెపి నాయకత్వాన్ని పరిగణనలోకి స్వీకరించలేదు. నేరుగా మోడీ, అమిత్‌షాలతోనే సంప్రదింపులు జరిగాయి. బిజెపి రాష్ర్ట నాయకత్వం కూడా తమ పరువును అరువుగా పెట్టి కేంద్ర నాయకుల ఆదేశాలను శిరసావహించింది.
మరోవైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ ద్వారాలను పూర్తిగా తెరవడానికి జంకుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని, అధిష్టాన వైఖరేమిటో తెలుసుకోవడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం యోచిస్తున్నట్లు వెల్లడైంది. బిఆర్‌ఎస్‌లో బిజెపితో వద్దని కొందరు, కాంగ్రెస్‌తో వద్దని మరికొందరు రెండు ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఈ చర్చ శనివారం ముగిసిన శాసనసభ సమావేశాల సందర్భంగా యుథేచ్ఛగానే సాగింది. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కొందరు మీడియా ప్రతినిధులతో లాబీలలో జరిపిన ఇష్టాగోష్టిలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఏ పార్టీ గెలిచినా ‘మా పార్టీ మనుగడ’ ఉండదని చెప్పారు. అందువల్ల లోక్‌సభ ఎన్నికల ముందే ఒక రాజకీయ నిర్ణయం గైకొంటే మంచిదన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్ల్లీ పర్యటన ఈ పూర్వరంగంలోనే సాగుతుందన్న భావాలకు బలమిస్తున్నది. పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ అంశం కూడా చేరి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments