HomeNewsBreaking Newsబిఆర్‌ఎస్‌ అంటే…బిజెపి బంధువుల పార్టీ

బిఆర్‌ఎస్‌ అంటే…బిజెపి బంధువుల పార్టీ

ఖమ్మంలో కాంగ్రెస్‌ ‘జనగర్జన సభ’లో రాహుల్‌గాంధీ విమర్శ

తెలంగాణలో అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4000 వేల పెన్షన్‌
మొత్తం పోడుభూములు ఆదివాసీలకే
కాంగ్రెస్‌ అగ్రనేత హామీ
కర్నాటక ఫలితాలే తెలంగాణలో కూడా రిపీట్‌ అని వ్యాఖ్య
పొంగులేటి సహా పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
ప్రజాపక్షం/ ఖమ్మం
టిఆర్‌ఎస్‌ బిఆర్‌ఎస్‌గా మారి బిజెపి బంధువుల పార్టీగా పని చేస్తున్నదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పని చేస్తుంటే విద్వేషాన్ని కలిగిస్తుందని మేము కలపడం చేస్తుంటే వారు విడదీస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ సిద్దాంతాన్ని దేశ ప్రజలు సమర్థిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల స్వప్నం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని కానీ బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరలేదన్నారు. ఇందిరా గాంధీ దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల కోసం లక్షలాది ఎకరాల భూమిని పంచితే బిఆర్‌ఎస్‌ పార్టీ ఆ భూమిని లాక్కుంటుందని భారత్‌ జోడోయాత్రలోనే తెలంగాణ ప్రజలు నా దృష్టికి తీసుకు వచ్చారని రాహుల్‌ తెలిపారు. ఆ భూములు తెలంగాణ ముఖ్యమంత్రివి కావని కాంగ్రెస్‌ పార్టీ మీకు హక్కు కల్పించిన భూములని ఆయన తెలిపారు. అవినీతిలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందున్నారని కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ధరణి ద్వారా భూములను దోచుకుంటున్నారని రాహుల్‌ ఆరోపించారు. మిషన్‌ కాకతీయ సహా పలు పథకాల్లో అవినీతి జరిగిందని రైతులు, ఆదివాసీలు, దళితులు, యువకులను మోసం చేసి దోచుకున్నారని ఆయన తెలిపారు. పార్లమెంటులో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడుతుంటే బిఆర్‌ఎస్‌ మాత్రం బిజెపికి బీ టీమ్‌గా పనిచేసిందని ఆయన స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిన నరేంద్ర మోడీకి కేసిఆర్‌ మద్ధతునిచ్చారని నరేంద్ర మోడీ చేతిలో సిఎం కేసిఆర్‌ కంట్రోల్‌ రిమోట్‌ ఉందని ఆయన తెలిపారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ ఇచ్చామని హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించామని ఖమ్మం సభలో చేయూత పథకం ద్వారా వృద్దులు, వితంతువులకు రూ. 4వేల పెన్షన్‌ ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆదివాసీలకు మొత్తం పోడు భూమిని పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఓడించిందన్నారు. బిజెపి వెనుక సంపన్నులు, ధనిక వర్గాలుంటే కాంగ్రెస్‌ వైపు రైతులు, కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు నిలిచి గెలిపించారన్నారు. తెలంగాణలోనూ అదే జరగబోతుందని బిఆర్‌ఎస్‌ వెనుక సంపన్నులు, కుటుంబ మిత్రులు, కాంట్రాక్టర్లు ఉన్నారని కాంగ్రెస్‌ వెనుక రైతులు, పేదలు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల పేద ప్రజలు ఉన్నారని రాహుల్‌ తెలిపారు. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ముక్కోణపు పోటీ జరుగుతుందని ప్రచారం జరిగిందని కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి ఖతమైందన్నారు. హైవే మీద వెళ్తుంటే కారుకు నాలుగు టైర్లు పంచరైనట్లుగా బిజెపి పరిస్థితి తయారైందన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌కు బిజెపి బీ టీమ్‌ అయినా బిఆర్‌ఎస్‌కు మధ్య మాత్రమే పోటీ ఉంటుందని బిజెపి బీ టీమ్‌ను తెలంగాణలో ఓడించబోతున్నామని రాహుల్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బిఆర్‌ఎస్‌ను పిలవాలని కొందరు సూచించారని బిఆర్‌ఎస్‌ బీ టీమ్‌ అయినందున ఆ పార్టీతో కలిసి కూర్చునే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసిందన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లను వ్యతిరేకించి కాంగ్రెస్‌ ఆలోచన విధానంతో పనిచేసే వారికి కాంగ్రెస్‌ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. యువకులను కేసిఆర్‌, నరేంద్ర మోడీ మోసం చేశారని రాహుల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే వెన్నుముఖ అని ఆ శక్తిని చూపి తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావాలన్నారు. బిజెపి విద్వేషం చిమ్ముతుంటే కాంగ్రెస్‌ పార్టీ ప్రేమ కురిపిస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని రాహుల్‌ గాంధీ కోరారు. 1250 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన మల్లు భట్టివిక్రమార్కను రాహుల్‌ గాంధీ అభినందించారు. ఆయన పాదయాత్రకు పేద, బడుగు, బలహీన వర్గాలు అండగా నిలిచాయన్నారు. భట్టి పాదయాత్ర ద్వారా తెలుసుకున్న అనేక విషయాలను కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేరుస్తామని రాహుల్‌ తెలిపారు. బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను మరస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కష్ట కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి దన్నుగా నిలిచిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో పార్టీకి దన్నుగా నిలిచి అధికారంలోకి తేవాలన్నారు. తెలంగాణ కేసిఆర్‌ జాగీర్‌ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఈ సభలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య, అరికల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి రాహుల్‌ గాంధీ ఆహ్వానించారు. ఈ సభలో కాంగ్రెస్‌ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, రేణుకా చౌదరి, వి. హన్మంతరావు, ఖమ్మంజిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌ఎ పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
అడుగడుగునా ఆటంకం…
ఖమ్మంలో కాంగ్రెస్‌ సభకు ప్రజలు రాకుండా అడుగడుగునా ఆటంకం కలిగించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బహిరంగ సభకు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్సులు ఇవ్వకపోగా, పోలీసులు, రవాణా శాఖ అధికారులచే వాహనాలన్నింటినీ సీజ్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు. కనీసం ఆటోలోనైనా తరలి వచ్చేందుకు పోలీసులు అవకాశం కల్పించలేదన్నారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీకి అధికారులు తొత్తులుగా పనిచేశారని, గులాబీ చొక్క ఒక్కటే ధరించలేదన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, కాంగ్రెస్‌ సభకు లక్షలాది మంది తరలివచ్చి జయప్రదం చేశారన్నారు. నిరందాలు, అడ్డగింతలు అభిమానమున్న ప్రజలను నిలువారించలేరని, ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ అర్థం చేసుకుంటే మంచిదన్నారు. నిర్భందాలతో జనాభిప్రాయాన్ని నిలువరించలేరని ఆయన తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments