ఐసియులో 9 మంది విద్యార్థులు
తల్లితండ్రుల ఆందోళన
అస్వస్థతకు కారణమైన మెస్సుల నిర్వాహకులపై కేసు నమోదు
రాజకీయ నాయకులు ట్రిపుల్ ఐటిని సందర్శించకుండా అడ్డుకున్న పోలీసులు
ప్రజాపక్షం/నిర్మల్ నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటిలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెస్‌లో శుక్రవారం ‘ఎగ్ కర్రీ’తో భోజనం చేసిన దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అక్కడున్న సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్‌లో, సొంత వాహనాల్లో నిజామాబాద్, బాసర, భైంసా ఆసుపత్రులలో చేర్పించారు. వీరిలో 9 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని ఐసియూలో ఉంచారని తెలియడంతో విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనలో బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టారు. రెండు మెస్‌ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 300 మందికి పైగా వాంతులు, విరేచనాలు కాగా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత పలువురు విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. నిజామాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి ఐసియులో 9 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్పికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు మెస్ నిర్వాహకులపై ఐసిసి 273, 336, ఎస్ఎస్ యాక్ట్ -2006 సెక్షన్ 59(3) కింద కేసులు నమోదు చేశారు.రాజకీయ నాయకులను అడ్డుకున్న పోలీసులు పలువురు రాజకీయ నేతలు వారిని పరామర్శించడానికి వెళ్లారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా, ట్రిపుల్ ఐటిని సందర్శించకుండా కఠిన నిబంధనలు విధించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లోని వివిధ ఆసుపత్రులలో ఉన్న విద్యార్థులను ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. బాసరలోని ట్రిపుల్ ఐటిలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణను, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, నిర్మల్ మాజీ ఎంఎల్ఎ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని, డిసిసి అధ్యక్షులు రామారావు పటేల్‌లను యూనివర్సిటి లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు.
మెస్ నిర్వాహకులపై కేసు నమోదు
గతంలో విద్యార్థులు తినే ఆహారంలో బొద్దింకలు, కప్పలు, పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అధికారులు నామమాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రధాన పత్రికల విలేఖరులకే మళ్లీ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చి ట్రిపుల్ ఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్, అధికారులతో వారు కుమ్మక్కయ్యారని అంటున్నారు. అదే కుట్రలో భాగంగా విద్యార్థులకు అన్నంలో ఏమైనా కలిపారా? అనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
బాసర ట్రిపుల్ ఐటిలో ఉద్రిక్తత
RELATED ARTICLES