ప్రాణాలతో పదిమంది బయటపడగా నలుగురు గల్లంతు
రంగంలోకి పోలీస్, ఫైర్, గజ ఈతగాళ్లు
గల్లంతైన వారి కోసం తీవ్ర ప్రయత్నాలు
వరంగల్ రూరల్ జిల్లా గవిచర్ల ప్రధాన రహదారిలో ఘటన
ప్రజాపక్షం/వరంగల్‌బ్యూరో
వరంగల్ -నెక్కొండ ప్రధాన రహదారిలోని సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో 14 మందితో వెళ్తున్న జీపు నేరుగా రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా నలుగురు గల్లంతయ్యారు. జీపు డ్రైవర్‌కు పిడ్స్ రావడం వల్లనే ఘటన జరిగినట్లు ప్రాణాలతో బయటపడిన బాధితులు పేర్కొంటున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ నుండి నెక్కొండకు షటిల్ ట్రిప్పులు నడిపే ప్రైవేటు జీపు రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కూడా వరంగల్‌లో ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైంది. వరంగల్ శివనగర్‌లో దాదాపు 3.30 గంటల సమయంలో జీపు నిండుగా ప్రయాణికులతో వరంగల్ నుండి బయలు దేరింది. ప్రతి స్టేజీ వద్ద జీపును ఆపుతూ డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకొని దించుతూ వస్తున్నారు. ఆశాలపల్లి స్టేజీ దాటే సరికి జీపులో 14 మంది ప్రయాణికులున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. వారితో గవిచర్లకు చేరుకునే సమయంలోనే గ్రామ పొలిమేర రాగానే డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. వేగంగా వస్తున్న జీపు అదుపుతప్పి ఎడమవైపుకు దూసుకెళ్లింది. అక్కడే రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావిలో భూమి మట్టంతో నీరు నిలిచి ఉంది. అంతలోపే జీపు దూసుకెళ్లింది. కనురెప్పపాటులోనే జీపు బావిలోకి దూసుకెళ్లడం అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తేరుకొని ఒక్కొక్కరుగా పదిమంది వరకు బయటపడ్డారు. డ్రైవర్ సహా మరో నలుగురు జీపుతో బావిలోనే గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే సంగెం, మామునూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జెసిబి, ఫైరింజన్లను రంగంలోకి దింపారు. వాటితో పాటు గజ ఈతగాళ్లను కూడా పిలిపించి గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే జీపుతో పాటు బావిలో గల్లంతైన వారు డ్రైవర్‌తో సహా మరో నలుగురు ఉంటారా.. ఇంకా ఎక్కువమంది ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. మంగళవారం రాత్రి గడిచినా కొద్ది సహాయక చర్యలు ముమ్మరమవుతున్నాయి.
ప్రాణాలతో బయటపడ్డ పదిమంది వీరే..
వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో జీపు పడిపోయిన సంఘటనలో పది మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిలో సంగెం, నెక్కొండ మండలాలకు చెందిన వారుండడం గమనార్హం. నెక్కొండ గ్రామానికి చెందిన బండి కట్టయ్య(52), బానోతు విజయ మడిపల్లి, బానోతు రాంచంద్రు మడిపల్లి, గుగులోతు బుజ్జి మదనాపురం, భూక్య చిట్లి గూడూరు మండలం మదనాపురం, గుగులోతు వాజ్య గూడూరు మండలం మదనాపురం, గుగులోతు మంజుల నెక్కొండ, భూక్య శ్రీనివాస్ నెక్కొండ, భూక్య నవీన్ రెడ్లవాడ, మానోతు సుజాత పర్వతగిరిలు సురక్షితంగా ఒకరిసహాయంతో ఒకరు బయటపడ్డారు. గల్లంతైన నలుగురు కూడా ఈ గ్రామాలకు చెందిన వారుకాగానే భావిస్తున్నారు.
బావిలోకి దూసుకెళ్లిన జీపు
RELATED ARTICLES