వీధుల్లోకి వెళ్ళాలంటేనే జంకుతున్న జనం
పిల్లలను బయటకు వదలని తల్లిదండ్రులు
సారూ జర చూడండి అంటున్న మున్సిపల్ ప్రజలు
ప్రజాపక్షం/షాద్‌నగర్ మున్సిపాలిటిలో వీధి కుక్కలు స్వైర్య విహారం ఎక్కువైపోతుంది. నీటి నుండి బయటకు వెళ్ళాలంటే ఎటు నుండి శునకాలు వస్తాయోననే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. ఇత చిన్నారులు అయితే ఇళ్ళ నుండి బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. మొరగని
కుక్కలే కాదు..మొరిగేవి సైతం ప్రజల పిక్కలు పట్టుకొని పీక్కుతింటున్నాయని ప్రజలు అంటున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటి పరిధిలోని 23వార్డులో ఎక్కడ చూసినా పిచ్చికుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. ప్రజలను పట్టి పీడిస్తున్న కుక్కలను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతుందని, మున్సిపల్ పరిధిలోని విజయనగర్ కాలనీ, ఈశ్వర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, కసాబ్‌వాడ, న్యూగంజ్, పద్మావతి కాలనీ వంటి అనేక కాలనీల్లో కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. దాంతో పాఠశాలకు వెళ్ళె విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్నారు. ఇంటి నుండి పాఠశాలకు కాలినడకన వెళ్ళాలంటేనే ఎటు నుండి ఏ కుక్క వచ్చి కరుస్తుందోననే భయంతో వెళ్ళడం లేదు. తల్లిదండ్రుల సహాయం తీసుకొనే పాఠశాలలకు విద్యార్ధులు వెళ్తున్నారు. అయినా కొన్ని సందర్భాల్లో ఏదోరకంగా వచ్చి కరుస్తునే ఉన్నాయి. ప్రధాన రహదారు వెంట ప్రతి రోజు కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. కాలనీల్లో కాలినడక ద్వారా వెళ్తున్న ప్రజలను మరీ వెంబడించి కరుస్తున్నాయి. శునకాలు గుంపులు..గుంపులుగా వచ్చి దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టు ఇంజక్షన్లు వేయించుకునే వారు..ప్రస్తుతం అలా లేకుండా పోయింది. ద్విచక్ర వాహనదారులు వెళ్ళున్న సమయంలో ఒక్కసారిగా వచ్చి దాడి చేసేందుకు యత్నిస్తుండగా బైక్‌పై వెళ్తున్న వారు కిందపడి తీవ్రంగా గాయపడిన సంఘటనలు అనేకంగా ఉన్నాయని చెప్పవచ్చు. వాహనాల వెంట పరుగులు తీస్తూ మరీ కరుస్తుండటంతో ఏమి చేయాలో తెలియక ప్రజలు సతమతమవున్నారు. జంతు సంరక్షణ చట్టం వల్ల వీధి కుక్కల సంఖ్య క్రమంగా పెరిగిపోయిందని, ప్రభుత్వం స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల నుండి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వెడుకున్న ఫలితం లేకుండా పోయిందని మున్సిపల్ ప్రజలు పేర్కొన్నారు.
వీధి కుక్కలను నియంత్రించేందుకు అధికారులతో సంప్రదిస్తాం
-షాద్‌నగర్ మున్సిపల్ చైర్మెన్ కొందూటి నరేందర్
షాద్‌నగర్ మున్సిపాలిటిలోని వార్డులో వీధి కుక్కల సంఖ్య క్రమంగా పెరిగిపోయిందని, ఇదే విషయాన్ని సంబంధిత అధికారులతో నియంత్రించేందుకు చర్చిస్తున్నామని చైర్మెన్ కొందూటి నరేందర్ తెలిపారు. ఇప్పటికే అనేక మందిపై కుక్కలు దాడులు చేశాయనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని, వాటన్నింటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.