కరోనా పరీక్షల కోసం అక్కడ… ఇక్కడ అంటూ తిప్పుతున్న వైనం
తిరగలేక ఇబ్బందులు పడుతున్న మహమ్మారి లక్షణాలున్న వ్యక్తులు
బస్తీల్లో పరిమిత సంఖ్యలోనే పరీక్షలు
తీవ్ర ఆందోళనలో బాధితులు
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా… పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పుతున్నదొకటైతే… క్షేత్ర స్థాయిలో మరో విధంగా జరుగుతున్నాయి. సామాన్యులు ఇబ్బందులకు గురివాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిమిత సంఖ్యలో పరీక్షలు చేయడంతో బాధితులు వెనక్కి మళ్లిపోతున్నారు. మీరు నివాసముండే ప్రాంతం మా ప్రాథమిక కేంద్రం పరిధిలోకి రాదంటూ రోగులను పంపిచేస్తున్నారు. దీం తో కరోనా లక్షణాలు ఉన్న బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ అయ్యిందని కూడా ప్రకటించారు. ఆన్‌లాక్ తరువాత నగర వాసులు ఇతరాత్ర అవసరాల కోసం బయట తిరుగుతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ నియంత్రణ చర్యలు మచ్చుకైనా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఇందుకు ఇటీవలి కాలంలో పలువురు ప్రజాప్రతినిధులే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే లక్షణాలు ఉన్న వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో బాధితులకు సత్వరం పరీక్షలు చేయించి స్వతన కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 97 ప్రభుత్వ ప్రాథమిక, బస్తీ దవాఖానాలు తదితర కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉదయం పుట మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం 25 నుంచి 30 మందిలోపే.. అది కూడా టోకెన్ లభించిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. తరవాత వచ్చిన వారికి చేయడం లేదు. ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే పరీక్షలు నిర్వహించుకోవాలని నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డుపై చిరునామా చూస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మీరు ఉంటున్న ప్రాంతం మా పరిధిలోకి రాదని తిప్పిపంపుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన ఆరోగ్య కేంద్రం ఎక్కడ ఉందని అడిగితే తెలియదని బదులిస్తున్నారు. ఈసడించుకుంటూ… చిరాకు పడుతు సమాధానాలు ఇస్తున్నారు. అసలే కరోనా లక్షణాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న బాధితులకు ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వ్యవహారశైలితో మరింత మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రాంనగర్ ఈస్ట్ పార్శిగుట్టకు చెందిన ఒక వ్యక్తి మూడు నాలుగు రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. సదరు వ్యక్తి ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రానికి వెళ్లితే మీ ప్రాంతం మా పరిధిలో రాదని చెప్పారని సదరు వ్యక్తి వాపోయాడు. కనీసం తమ ప్రాంతం వారికి ఏ ప్రాథమిక కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే సమాచారం కూడా చెప్పడం లేదని వాపోయాడు. అక్కడా.. ఇక్కడా.. తిప్పలు పడి దుర్గభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తారని తెలుసుకొని అక్కడికి వెళితే.. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించడం లేదని సిబ్బంది చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కరోనా లక్షణాలు ఉన్న బాధితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే తమ ప్రాంతానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్కడ ఉంటుందనే విషయం చాలా మ ంది నగర వాసులకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ రోజుల్లో చిన్న చిన్న వైరల్ జ్వరాలు, ఇతర సమస్యలకు అందుబాటులో ఉన్న ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లి చికిత్సలు చేయించుకోవడం నగర వాసులు అలవాటు పడిపోయారు. దీంతో ప్రాథమిక కేంద్రాలకు పోయే అలవాటు లేకపోవడంతో తమ ప్రాంతానికి చెందిన కేంద్రం చాలా మందికి తెలియదు. అయితే లక్ష్మణ రేఖ మాదిరిగా గిరి గీసుకొని ఎక్కడి వారికి అక్కడే పరీక్షలు నిర్వహిస్తామంటే ఎలా అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. తెలిసో తెలియకో ఎక్కడికి వెళ్లినా పరీక్షలు నిర్వహించాలని కొరుతున్నారు. ఉన్నత స్థాయిలో మాత్రం కరోనా పరీక్షల ని ర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశామని, అంతా పారదర్శకంగా జరుగుతుందని మంత్రి ఈటల నుంచి మొదలుకొని, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వరకు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది
బాధితులతో బంతాట
RELATED ARTICLES