ఇరాన్ టాప్ జనరల్ ఖాసీం సులేమాని మృతి
అమెరికా డ్రోన్ దాడికి కకావికలం
ఖుద్స్ ఫోర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని(62)ని శుక్రవారం అమెరికా హతమార్చింది. ఆయన అత్యంత శక్తిమంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు జన రల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ఖుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూల కార్యకలాపాలను సాగిస్తుంటుంది. ముఖ్యంగా లెబనాన్‌లోని హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండగా ఈ ఖుద్స్ ఫోర్స్ ఉంది. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్‌లో పాలిస్తోంది. ఇరాక్‌లోని కుర్దులు, షియాలకు కూడా అనుకూలంగా ఈ దళం పనిచేస్తోంది. ఖుద్స్ ఫోర్స్ వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు అన్నీ సులేమాని కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇరాక్‌లో అమెరికా సిబ్బందిని రక్షించేందుకు జరిపిన అమెరికా డ్రోన్ దాడిలో జనరల్ ఖాసీం సులేమాని చనిపోయారని అమెరికా పెంటగాన్ ప్రకటించింది. ఇరాన్ మధ్య పర్షియా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నాటకీయంగా పెరిగిపోయాయి. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంవైపు శుక్రవారం ప్రయాణిస్తున్న సులేమాని వాహనశ్రేణి (కాన్వాయ్)పై శుక్రవారం అమెరికా డ్రోన్ ద్వారా క్షిపణిని ప్రయోగించింది. దాడిలో జనరల్ ఖాసీం సులేమాని, ఇరాక్ శక్తిమంతమైన హషద్ అల్ పార్లమెంటరీ ఫోర్స్ డిప్యూటీ చీఫ్, ఇరాన్ మద్దతు ఉన్న తీవ్రవాదులు కొందరు మరణించారు. ఇరాన్‌లో ఆయతొల్లా ఖమేనీ తర్వాత రెండో శక్తిమంత నాయకుడిగా ఖాసీం సులేమాని ఉన్నారు. అతడు నేతృత్వం వహించే ఖుద్స్ ఫోర్స్ నేరుగా ఆయతుల్లా ఖమేనీకే అన్ని విషయాలు రిపోర్ట్ చేస్తుంటుంది. సులేమానిని ఇరాన్‌లో జాతీయ యోధుడిగా కీర్తిస్తుంటారు. వైమానిక దాడిలో సులేమానీ చనిపోయిన విషయాన్ని పెంటగాన్ ధ్రువీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే సైనిక చర్య తీసుకున్నట్లు పెంటగాన్ తెలిపింది. ‘అధ్యక్షుడి ఆదేశాల మేరకు, విదేశంలోని అమెరికా సిబ్బందిని కాపాడేందుకు స్వీయరక్షణ చర్యను అమెరికా చేపట్టింది. దాంట్లో సులేమాని హతమయ్యాడు. విదేశా ఉగ్రవాద సంస్థగా అమెరికా పేర్కొన ఇరానీయన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ ఫోర్స్‌కు ఖాసీం సులేమాని నేతృత్వం వహిస్తున్నారు’ అని పెంటగాన్ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఫ్లోరిడాలో సెలవులు గడుపుతున్న ట్రంప్ ఈ దాడిపై వెంటనే ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కాకపోతే అమెరికా జెండా చిత్రాన్ని ట్వీట్ చేశారు. బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇరాన్ పాలకవర్గానికి అనుకూలంగా ఉన్న ఇరాకీ మద్దతుదార్లు దిగ్బంధించాక ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన కొన్ని రోజులకే ఈ దాడి జరిగింది. కరడుగట్టిన హషద్ వర్గంపై కూడా అమెరికా ప్రాణాంతక వైమానిక దాడులు జరిపింది. జనరల్ సులేమాని, ఇరాన్ మద్దతు ఉన్న అధికారులు రెండు కార్లలో బాగ్దాద్ విమానాశ్రయానికి వెళుతుండగా కార్గో ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడిచేసింది. జనరల్ సులేమాని లెబనాన్ లేక సిరియా నుంచి విమానంలో వచ్చారని సమాచారం. ఆయన వాహనశ్రేణిపై అనేక మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోయి ఉంటారని తెలిసింది. ఈ విషయాన్ని బగ్దాద్ మీడియా పేర్కొంది. భవిష్యత్తులో దాడులు చేసే ప్రణాళికలను ఇరాన్ మానకునేలా చేసేందుకే అమెరికా ఈ దాడులు చేసిందని పెంటగాన్ పేర్కొంది. ఇరాక్ ప్రాంతంలో అమెరికా దౌత్యవేత్తలు, సర్వీస్ మెంబర్స్‌పై దాడులు చేసేందుకు జనరల్ సులేమాని క్రియాశీలక ప్రణాళికలు రూపొందిస్తుండడంతో అమెరికా ఈ దాడులకు దిగింది. ‘అమెరికా, దాని మిత్రపక్షాల సర్వీసు సభ్యులు వేలాదిగా చనిపోవడంలో, గాయపడ్డంలో ఖుద్స్ బలగం కారణమని’ పెంటగాన్ పేర్కొంది. ‘ఈ వారంలో బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని జనరల్ సులేమాని ఆమోదించారు’ అని కూడా పెంటగాన్ తెలిపింది. ‘మా ప్రజలను, మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు అమెరికా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. దాడులు చేస్తుంది’ అని కూడా పెంటగాన్ చెప్పింది.ఇరాన్ అధినేత ఆయతొల్లా అలీ ఖమేనీ టెహరాన్‌లో ‘ ఈ దాడులు చేసిన వారిపై తీవ్ర ప్రతీకారం ఉంటుంది’ అని చెప్పారు. అంతేకాక ఆయన ఇరాన్‌లో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ‘సులేమానీ తాను అమరవీరుడిని(షహీద్) కావాలని అనుకుంటుండేవారు. చివరికి దేవుడు ఆయన కోరికను ఉన్నత గతిని ప్రసాదించాడు’ అన్నారు. సులేమాని చంపివేతపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కూడా ప్రతిస్పందించారు.‘అమెరికా బెదిరింపులకు వ్యతిరేకం గా, ఇస్లామీయ విలువలను కాపాడేందుకు ఇరాన్, ఇత ర స్వేచ్ఛాయుత దేశాలు నిలబడాలన్న కృతనిశ్చయం రెట్టింపయింది’ అన్నారు. ఈ తాజా దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయి.
‘ఇరాన్ దాడికి వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న సాహసోపేత చర్యను నేను అభినందిస్తున్నాను’ అని దక్షిణ కరోలినా రాష్ట్రం సెనేటర్ లిండ్సే గ్రాహం టీట్ చేశారు. ‘ఇరాన్‌కు…మీరు ఇంకా కావాలనుకుంటే…ఇంకా బాగా జరుగుతుంది’ అని కూడా హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయాన్ని ఆయన క్యాబినెట్ మాజీ కొలీగ్ నిక్కీ హేలీ కూడా సమర్థించారు. సెనేటర్ మార్కో రూబియో కూడా తన ట్వీట్ ద్వారా ట్రంప్‌ను సమర్థించారు.
డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీచేయబోతున్న, అధ్యక్ష పదవికీ పోటీచేయబోతున్న సెనేటర్ బెర్నీ శాండర్స్ ‘మధ్యప్రాచ్యంలో మరో ప్రమాదకర ఉద్రిక్త వాతావరణం సంభవిస్తోంది. దాని ఫలితంగా అనేక మంది చనిపోయే అవకాశం ఉంది. ట్రిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయే అవకాశం ఉంది’ అని చెప్పారు. సభా స్పీకర్, టాప్ డెమోక్రట్ నాన్సీ పెలోసీ రెచ్చగొట్టే చర్యలతో అనేకమంది అమెరికా సర్వీసు సభ్యుల, దౌత్యవేత్తలు, ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకురావొద్దు’ అని హెచ్చరించారు. ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా 2018లో తప్పుకున్నప్పటి నుంచి ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అప్పట్లో అమెరికా, ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురు ఎగుమతులు రద్దయేలా చర్యలు తీసుకుంది.