జపాన్ (టోక్యో): ఒలింపిక్ టెస్టు ఈవెంట్ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. శివ థాప (63 కిలోలు), పూజా రాణి (మహిళల 75 కిలోలు) పసిడి పతకాలు ముద్దాడారు. ఆశీష్ (69 కిలోలు) రజతంతో మురిశాడు. ఈ పోటీల్లో భారత బాక్సర్లు ఆది నుంచీ సత్తా చాటారు. ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించి శివ థాప ఫైనల్లో కజక్‌స్థాన్ జాతీయ ఛాంపియన్, ఆసియా కాంస్య పతక విజేత సనటాలి టోల్తయేవ్‌ను 5–0తో చిత్తుగా ఓడించాడు. థాప ప్రస్తుతం జాతీయ ఛాంపియన్. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గతంలో కాంస్య పతక విజేత. మహిళల 75 కిలోల ఫైనల్లో పూజ తన ప్రత్యర్థి కైట్లిన్ పా ర్కర్ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. స్వర్ణ పతకం మెడలో ధరించింది. జపాన్ బాక్సర్ సెవాన్ ఒకజవా చేతిలో ఓడి ఆశీష్ (60 కిలోలు) రజతానికి పరిమితం అయ్యాడు. అంతకు ముందు తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కిలోలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కిలోలు), సమిత సంగ్వాన్ (91 కిలోలు), వహ్లింపుయా (75 కిలోలు) వారి విభాగాల్లో జరిగిన సెమీసుల్లో ఓడి కాంస్య పతకాలను అందుకున్నారు.
బాక్సింగ్‌లో భారత్‌కు పసిడి పతకాలు
RELATED ARTICLES