జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారని, మరో నలుగురు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బుండి జిల్లా కోటా రహదారిపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 29 మందితో కూడిన పెళ్లి బృందం ఓ ప్రైవేట్ బస్సులో కోటా నుంచి సవాయ్ మాధోపూర్‌కు వెళుతోంది. లెఖారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాప్డి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్ శ్యాంసింగ్ వాహనంపై అదుపు కోల్పోవడంతో వంతెన పైనుంచి మెజ్ నదిలో పడిపోయింది. అయితే ఆ వంతెనకు పిట్టగోడ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని లెఖారి ఎస్‌ఐ రాజేంద్రకుమార్ వెల్లడించారు. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారని, మరో పది మందిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారన్నారు. క్షతగాత్రులను లెఖారి ఆసుపత్రికి తరలించామన్నారు. గాయపడిన పడిన వారిని స్థానికులు రక్షించారన్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ప్రమాదంలో 24 మంది మరణించడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల్లో 11 మంది పురుషులు, పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని బుండి జిల్లా కలెక్టర్ అంతర్ సింగ్ నెహ్రా చెప్పారు. ఓ మహిళ, చిన్నారితో సహా ఐదుగురికి గాయాలయ్యాయన్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమించడంతో కోటా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మరో ఇద్దరు కోలుకోవడంతో డిశ్చార్జి చేశామన్నారు. బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని వారు చెప్పారన్నారు. క్షతగాత్రులను మురళి (55), దీపక్ సింధి (18), అమిత్ (35), కన్ను (13), మంజు (35)లుగా గుర్తించామన్నారు. తన మేన కోడలు వివాహం నిమిత్తం బుధవారం ఉదయం బంధుమిత్రులతో కలిసి బస్సులో బయల్దేరామని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 20 ఫీట్ల ఎత్తున్న వంతెన పైనుంచి బస్సు నదిలో పడిందని మురళి వివరించారు. ప్రమాదం ఉదయం 9:35 గంటలకు జరిగిందని, విషయం తెలుసుకోగానే పోలీసులు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు పేర్కొన్నారు. బస్సు నదిలో పడగానే అందులో ఉన్నవారు పెద్దపెట్టున అరవడంతో గ్రామస్థులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారన్నారని ఎస్‌ఐ రాజేంద్ర కుమార్ చెప్పారు. బస్సులో ఉన్నవారిని స్థానికులు బయటికి తీసుకువచ్చారన్నారు. ఇప్పటివరకు బస్సును నదిలో నుంచి వెలికితీయలేదని, విచారణ చేపట్టామని డిఎస్‌పి శ్యాంసుందర్ విషోని అన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణ అనంతరం అసలు విషయం తెలుస్తుందన్నారు. 24 మృతదేహాలను లెఖారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించామన్నారు.
బస్సు నది పాలు… 24 మంది మృతి
RELATED ARTICLES