ఉద్యోగులకు అందని వేతనాలు
పెన్షనర్ల ఖతాల్లో జమకాని డబ్బులు
ఉద్యోగ విరమణ చేసిన వారి చెక్కులు వెనక్కు తీసుకున్న వైనం
వేతనాల కోసం రోడ్డెక్కిన జిహెచ్ఎంసి కార్మికులు
ప్రజాపక్షం/హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జిహెచ్ఎంసి) ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. సకాలంలో ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. జనవరి మాసం లో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన చెక్కు లు ఇచ్చినా అధికారులు తిరిగి వెనక్కు తీసుకున్నారు. అంటే జిహెచ్ఎంసి ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలను ఉద్యోగులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేసేవారు. ప్రస్తుతం ఖజానా ఖాళీకావడంతో 10వ తేదీ తరువాత రెగ్యులర్ ఉద్యోగులు, 20వ తేదీ తరువాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు సర్దుతున్నారు. వేతనాలకే డబ్బులు లేని పరిస్థితుల్లో ఇక ఇతర పనులకు సంబంధించిన బిల్లులు కుప్పలు తెప్పలుగా పేరుకపోయాయని జిహెచ్ఎంసి వర్గాలు చెబుతున్నాయి. తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు, కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వేతనాలు ఇవ్వాలని రెగ్యులర్ ఉద్యోగులు, కార్మికులు జిహెచ్ఎంసి చరిత్రలో ఎప్పుడు నిరసన కార్యక్రమం చేపట్టిన దఖాలాలు లేవు. తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని జెఎసి కో చైర్మన్ పి.బాల్ నర్సింగ్‌రావు అన్నారు. గతంలో వెయ్యికోట్ల రూపాయలకు పైగా బ్యాంకు డిపాజిట్లతో ఉన్న జిహెచ్ఎంసి ఖజానా ప్రస్తుతం దివాళా తీసిందన్నారు. ప్రస్తుతం అప్పుల ఊబిలో జిహెచ్ఎంసి కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇచ్చిన ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులను అధికారులు తిరిగి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. జిహెచ్ఎంసి చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదన్నారు. తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువులు, పిల్లలు ఫీజులు, వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధులైన పెన్షనర్లు వైద్య ఖర్చుల కోసం కష్టాలు పడుతున్నారని తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రతినెల 1వ తేదీన రెగ్యులర్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరారు. 48 గంటల్లోగా వేతనాలు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాల్ నర్సింగ్‌రావు అధికారులను హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జెఎసి సెక్రెటరీ జనరల్ ఆదిల్ షెరిఫ్, నాయకులు విఠల్‌రావు కుల్కర్ణి, ఒ.శంకర్, కె.చంద్రశేఖర్, ఎ.లవ్‌కుమార్, డి.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.