కాళేశ్వరం అదనపు టిఎంసి వరద కాలువ పనులను నిలిపివేయాలి
కాంట్రాక్టర్ల కోసమే నిర్మాణాలు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
బాధిత రైతులకు సంఘీభావం
ప్రజాపక్షం/కరీంనగర్ బ్యూరో
అదనపు టిఎంసి వరుద కాలువ పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణ వెంటనే నిలిపివేయాలని, ఈ కాలువల నిర్మాణం కాంట్రాక్టర్ల కోసమేనని, వెంటనే కాలువ పనులను నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అదనపు టిఎంసి వరుద కాలువ నిలుపుదలకై రామడుగు మండలం, షానగర్‌లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని వారికి చాడ వెంకట్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గాయత్రి పంప్ హౌస్ ద్వారా, వరుద కాలువ నిర్మాణాల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాల భూములు ఇక్కడి రైతులు సాగునీటి కాలువల కోసం త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులపై మరోసారి భారం వేసే విధంగా ఉన్న భూములతో పాటు ఇండ్లను సైతం భూసేకరణలో బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటోందని, తద్వారా భూములు, ఇండ్లు పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమే రైతులకు అవసరం లేని అదనపు టిఎంసి కాలువలు, లింక్ వన్ కెనాల్ కాలువలు నిర్మించడం ఎవరి ప్రయోజనాల కోసమే ప్రజలకు చెప్పాలని ప్రభుత్వాన్ని చాడ హితవు పలికారు. ఈ గ్రామాల్లో రైతులకు పుష్కలంగా సాగునీరు ఉన్నప్పటికీ రామడుగు మండలంలోని 12 గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న అదనపు టిఎంసి కాలువ, ఓటి లింక్ కెనాల్ కాలువ నిర్మాణానికి బలవంతపు భూసేకరణ జరపడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమే అన్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే గతంలో డిజైన్ చేసిన కాలువల ద్వారా ఆయా గ్రామాల చెరువులు నింపితే ఈ ఓటి లింక్ కెనాల్ భూసేకరణ అవసరం లేదన్నారు. ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. రైతులు న్యాయబద్ధమైన సమస్య పరిష్కారం కోసం అదనపు వరద కాలువ, ఓటి లింక్ వన్ కెనాల్ కాలువ నిలుపుదల చేసేంత వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని చాడ వెంకట రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, గొడిశాల తిరుపతి గౌడ్, మచ్చ రమేష్, నాయకులు ఎగుర్ల మల్లేశంతో పాటు షా నగర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బలవంతపు సేకరణ వద్దు
RELATED ARTICLES