రైతులపై దాడికి యత్నం
యువకుడు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామానుజవరంలో ఉద్రిక్తత
ప్రజాపక్షం/ మణూగూరు కనీస సమాచారం లేకుండా, రైతులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా బలవంతంగా భూ సేకరణ చేసేందుకు పోలీసుల అండతో రైతులను భయపెట్టాలని బిటిపిఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు లేకుండానే భూమిని స్వాధీ నం చేసుకునేందుకు ప్రయత్నించ డం తీవ్ర వివాదానికి దారి తీసింది. బిటిపిఎస్‌కు రైల్వే నిర్మాణం కోసం మణుగూరు మండలం రామానుజవరంలో భూమిని సేకరించేందుకు బిటిపిఎస్ అధికారులు సోమవారం గ్రామానికి చేరుకుని రైతులను బెదిరించే ప్రయత్నం చేశారు. భూసేకరణలో భాగంగా ఇంత వరకు రైతులకు ఆర్‌ఆర్ ప్యాకేజీని వర్తింపజేయలేదు. నాలుగేళ్ల క్రితం భూ సేకరణ జరిగినా పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో రైతులను భయపెట్టేందుకు ప్రయత్నించడం, సంకెళ్లు వేసే పరిస్థితి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో ఆర్‌ఆర్ ప్యాకేజీని వర్తింపజేయకుండా, రైతుల గోడును పట్టించుకోకుండా భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఏమిటని రైతులు ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న మహిళలు అధికారులను, ప్రభుత్వ తీరును నిలదీసి నానా శాపనార్థాలు పెట్టారు. కేతినేని రాజేష్ అనే యువకుడు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మణుగూరు మండల వ్యాప్తంగా బిటిపిఎస్ అధికారులు రెవెన్యూ, పోలీస్ అండ చూసుకుని పరిహారం ఇవ్వకుండానే బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పరిహారం ఇవ్వకుండా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే సహించబోమని రైతులు హెచ్చరించారు. పరిహారం దక్కకపోతే ప్రాణాలైనా వదులుతాం కానీ రైల్వేలైన్ నిర్మాణానికి భూమిని అప్పగించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. రైతుల ప్రతిఘటనతో ప్రస్తుతానికి అధికారులు వెనుదిరిగారు.
బలవంతపు భూ సేకరణ
RELATED ARTICLES