HomeNewsNationalబలవంతపు చర్యలు తీసుకోబోం

బలవంతపు చర్యలు తీసుకోబోం

సుప్రీంకోర్టుకు ఐటి విభాగం వెల్లడి
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌కు డిమాండ్‌ నోటీసుల నుంచి భారీ ఊరట
న్యూఢిల్లీ: ఆదాయపన్ను విభాగం వరుసగా జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉపశమనం లభించింది. తాము జారీ చేసిన పన్ను చెల్లింపు నోటీసులకు సంబంధించి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా బలవంతపు చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు ఐటి విభాగం తెలియజేసింది. సుమారు రూ.3,500 కోట్ల పన్నులు చెల్లించాలని జారీ చేసిన డిమాండ్‌ నోటీసులపై కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా కేసులో తుది తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని ఆదాయ పన్ను విభాగం తరుపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియజేశారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం రికార్డు చేసుకుంది. ‘కోర్టు ఎదుట దాఖలైన పటిషన్‌పై ప్రతివాది ఐటి విభాగం తరుపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ , గత మార్చి నెల అనేక తేదీలలో సుమారు 3,500 కోట్లు చెల్లించాలని జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల విషయంలో ఎలాంటి వివాదం లేదని పేర్కొన్నట్లు’ ధర్మాసనం తెలిపింది. నోటీసులకు సంబంధించి చేసుకున్న అప్పీల్‌లో అనేక అంశాలపై తీర్పులు ఇవ్వాల్సి ఉన్నదని, ప్రస్తుత సమయంలో పరిస్థితిని మరింత ముదరకుండా ఉండేందుకు రూ.3,500 కోట్ల పన్ను చెల్లింపునకు సంబంధించి ఐటి విభాగం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోమని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను జూలై 24వ తేదీ నాటికి సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కాంగ్రెస్‌ పార్టీ తరుపున సుప్రీం కోర్టుకు హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టులో సవాలు చేసిన 2016 తీర్పు ఆధారంగా, ఐటి విభాగం రూ.1,700 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్‌ నోటీసు జారీ చేసిందని మెహతా తెలిపారు. పిటిషనర్‌ రాజకీయ పార్టీ అని, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, ఏ పార్టీకీ సమస్య రాకూడదని, ఎన్నికల తరువాత జూలైలో చేపట్టే ఈ కేసుకు సంబంధించి రూ.1,700 కోట్ల బకాయిలు చెల్ల్లించకపోతే తాము చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. 2016 మార్చి 23లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏర్పాటు చేసుకున్న పరిమితుల ఆధారంగా 2021లో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఐటి నోటీసులు ఇచ్చారని, అందులో 20 శాతం చెల్లించాలని అవకాశం ఇచ్చినప్పటికీ చెల్లించలేదని సొలిసిటర్‌ జనరల్‌ మెహతా కోర్టుకు తెలియజేశారు. ఆ తరువాత కూడా ఏమి చెల్లించలేదని, దీంతో 2021లో జారీ చేసిన నోటీసుకు సంబంధించి రూ.135 కోట్లను 2024లో ఐటి విభాగం రికవరీ చేసుకున్నదన్నారు. ఆ నిబంధనల ప్రకారమే తాజాగా రూ.1700 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ నోటీసు ఇచ్చామని మెహతా వెల్లడించారు. 2016 హైకోర్టు తీర్పునకు వ్యతిరేకరంగా దాఖలైన ప్రధాన పిటిషన్‌పై ఐటి విభాగం జవాబు ఇవ్వాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు డిమాండ్‌ నోటీసును నిలుపుదల చేయాలా అని బెంచ్‌ ప్రశ్నించగా, ఆ అవసరం లేదని, వచ్చే వాయిదా వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని మెహతా అన్నారు. సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ మార్చి మాసంలో అనేక డిమాండ్‌ నోటీసుల జారీ చేశారని, వాటి విలువ రూ.1700 కాదని, సుమారు రూ.3500 కోట్లు అని, అవి ఐదేళ్ళకు సంబంధించినవని వివరించారు. తాజా నోటీసు ద్వారా, ఆదాయపన్ను విభాగం కాంగ్రెస్‌ పార్టీని మొత్తం రూ.3567 చెల్లించాలని కోరిందన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాజాగా జారీ చేసిన నోటీసులు 2014 (రూ.663 కోట్లు), 2015 ( సుమారు రూ.664 కోట్లు), 2016 (సుమారు రూ.417 కోట్లు) కు సంబంధించినవి. అందుబాటులో ఉన్న పన్ను రాయితీని నిలిపివేసి కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి మొత్తం విరాళాలపై ఐటి విభాగం పన్నులు విధించిందని సింఘ్వీ తెలియజేశారు. 2017 నుండి 2021 వరకు నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పన్నుల పునః అంచనాపై మార్చి 28న కాంగ్రెస్‌ సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మార్చి 22న దాఖలు చేసిన మరో పిటిషన్‌నుకూడా హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యలంలో కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐటి నోటీసులకు సంబంధించి అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలలో దెబ్బ తీసేందుకే కేంద్ర ప్రభుత్వం తన ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని, ఇది పన్ను ఉగ్రవాదమని కాంగ్రెస్‌ విరుచుకుపడింది. మరో వైపు సిపిఐకి సైతం రూ.11 కోట్లు చెల్లించాలని ఐటి విభాగం డిమాండ్‌ నోటీసు జారీ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments