HomeNewsBreaking Newsబన్సీలాల్‌పేట్‌ మెట్ల బావి చరిత్రకు సాక్ష్యం…

బన్సీలాల్‌పేట్‌ మెట్ల బావి చరిత్రకు సాక్ష్యం…

మెట్ల బావిని స్థానికులు అపురూపంగా కాపాడుకోవాలి
హైదరాబాద్‌ నగరానికి యునెస్కో గుర్తింపునకు కృషి చేస్తాం
మున్సిపల్‌ శాఖమంత్రి కె.టి.రామారావు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా గుర్తింపు తీసుకవచ్చేందుకు కృషి చేస్తామని మున్సిపల్‌ శాఖమంత్రి కెటి రామారావు అన్నారు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బన్సీలాల్‌పేట్‌ మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలన్నారు. బన్సీలాల్‌పేట్‌ మెట్ల బావిని సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు ఎంఎల్‌ఎ, ఎంఎల్‌ఎసి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌లతో కలిసి మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. బావిలో నుంచి బయటపడిన వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు సమావేశంలో మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ మెట్ల బావిని కాపాడుకోవాల్సిన, సంరక్షించుకోవాల్సి న, చెత్త పారేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా స్థానికులదే అన్నారు. మెట్ల బావిని కాపాడుకుంటూ హైదరాబాద్‌ నగరానికి స్ఫూర్తిగా నిలవండి అని స్థానికులకు సూచించారు. గత 13 నెలల నుంచి అహర్నిశలు శ్రమించి బన్సీలాల్‌పేట్‌ మెట్లబావికి కొత్త వైభవాన్ని అందించారన్నారు. టన్నుల కొద్ది చెత్తను స్వహస్తాలతో తీసి ఇంతటి అందమైన కానుకను హైదరాబాద్‌కు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు, జిహెచ్‌ఎంసి సిబ్బంది, స్థానికులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కెటిఆర్‌ అన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు, ఇతర పనులు ప్రారంభించుకున్నామని, కానీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సంతోషం కలుగుతుందన్నారు. ఇప్పుడు అట్లాంటి సందర్భం ఉందన్నారు. ఒక నగరం, పట్టణం, స్టీల్‌ కాంక్రీట్‌ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదని, నగరం చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్‌ తరాలకు అందించిన వాళ్లం అవుతామని కెటిఆర్‌ వివరించారు.
మరో 43 మెట్ల బావులను ఆధునీకరిస్తాం…
43 మెట్ల బావులను ఆధునీకరిస్తామని మేయర్‌ విజయలక్ష్మి చెప్పారని కెటిఆర్‌ అన్నారు. బన్సీలాల్‌ పేట్‌ మెట్ల బావి నిర్మాణ పనులను 25 సార్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారని తెలిపారు. స్థానికులకు ఈ బావి ప్రత్యేకత వివరించి, దీన్ని చాలా కష్టపడి పునరుద్ధరించినట్లు చెప్పారు. దీని వెనుకాల శ్రమ ఎంతో దాగుందన్నారు. 3,900 మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించారన్నారు. 863 ట్రిపుల్లో లారీల్లో చెత్తను తరలించారన్నారు. రూ. 10 కోట్లతో సుందరీకరించారని చెప్పారు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ బావిని భవిష్యత్‌ తరాలు గుర్తించుకునే విధంగా ఆధునీకరించారన్నారు. నీరు ఉబికి వచ్చేలా ఈ అద్భుత నిర్మాణానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కులీకుతుబ్‌షాహీ టూంబ్స్‌ వద్ద సిఎం నేతృత్వంలో ఆరు మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ వారు ఆధునీకరించారని తెలిపారు. వాటికి యునెస్కో నుంచి అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మొజాం జాహీ మార్కెట్‌, మీరాలం మండి, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, షేక్‌ పేట్‌ సరాయి, వీటన్నింటిని ఇంతే అద్భుతంగా పూర్వ వైభవం సంతరించుకునేలా ఆధునీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో మన చరిత్రకు, వారసత్వానికి, మన గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే వీటిని పునరుద్ధించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డి, ఎంఎల్‌ఎలు జి.సాయన్న, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, ఎంఎల్‌సి ప్రభాకర్‌, జిహెచ్‌ఎంసి జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటి కమిషనర్‌ ముకుంద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments