రేషన్ బియ్యం నాణ్యత సరిగా లేదు: టిపిసిసి చీఫ్ ఉత్తమ్
ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామిపై ఎస్‌పికి ఫిర్యాదు
ప్రజాపక్షం/హైదరాబాద్ : బత్తాయి ఢిల్లీకి ఎగుమతులు అయ్యేవి కావని, రాష్ట్ర ప్రభుత్వమే రూ.200 కోట్లు వెచ్చించి బత్తాయిని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయాలని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రిపబ్లిక్ టివి హెడ్ అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు చేయాలని శుక్రవారం ఆయన నల్లగొండ ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 12 కిలోల బియ్యం, రూ.1500 ఇంకా పేదలకు చేరలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం నాణ్యత సరిగా లేదని, వాటిని ప్రజలు తినడం లేదని చెప్పారు. 12 కిలోల బియ్యంలో కేంద్రం ఇచ్చిన 5కిలోల బియ్యం కూడా ఉన్నాయా? అనేది సిఎం కెసిఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్ ఇంకా రాలేదని అన్నారు. తెల్లకార్డు లేని వారికి కూడా బియ్యం, ఆర్థిక సహాయం అందజేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వ మాటలకు ఆచరణకు పొంతన లేదన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లో చేర్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని, కరోనా వ్యాప్తికి మతపరమైన రంగు పూయొద్దని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ నుంచి జర్నలిస్టులను ఆదుకోవాలని, ప్రభుత్వం కూడా ఆదుకోవాలన్నారు.