సభాపక్ష నేతలకు సుమిత్రా మహాజన్, వెంకయ్యనాయుడు ఆహ్వానాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఆరంభం కానున్నాయి. దీనికి ముందు అఖిలపక్ష సమావేశాలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు వేర్వేరుగా పిలుపులిచ్చారని అధికారులు ఆదివారం తెలిపారు. జనవరి 30న అఖిలపక్ష సమావేశానికి రావలసిందిగా సుమిత్రా మహాజన్ పిలుపునివ్వగా, జనవరి 31 ఉదయం అన్ని పార్టీల సభాపక్ష నాయకులు రావలసిందిగా వెంకయ్య నాయుడు ఆహ్వానించారు. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ చివరి సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి సహకరించాలని సుమిత్రా మహాజన్, వెంకయ్య నాయుడు ఇరువురు పిలుపునిచ్చారు. వీటితోపాటు జనవరి 30న ఉభయసభలకు చెందిన అన్ని పార్టీల నాయకులతో ప్రభుత్వం కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఉభయసభలు ఫిబ్రవరి 13 వరకు పనిచేయనున్నాయి.