లాభాల్లో ఉన్న ఎల్‌ఐసి షేర్‌ల విక్రయం దారుణం
తెలంగాణకు ఏమిచ్చారు?
ఆదాయ పన్ను తగ్గింపు వట్టిదే : చాడ
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక మాం ద్యం, నిరుద్యోగానికి కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎ లాంటి పరిష్కారం చూపించలేకపోయారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఇది దిశ లేని, అంకెల గారడీ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసి షేర్లను అమ్మేస్తామని ప్రకటించడం దారుణమని, ఈ చర్య పాలిచ్చే బర్రె ను అమ్మిన చందంగా ఉందన్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించడమే ల క్ష్యంగా ముందుకు సాగుతోందని మండిపడ్డా రు. ఈ మేరకు బడ్జెట్‌పై శనివారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పునర్విభజన చట్టంలో ఇచ్చిన వాగ్దానాలలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోద ప్రస్తావనే లేదన్నారు. ఒక వైపు ఆదాయం పన్ను తగ్గించామని చెబుతూనే, మరోవైపు ఇప్పటి వరకు వివిధ సెక్షన్‌ల కింద ఇస్తున్న పన్ను రాయితీలను తొలగించడమంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడమేనని ఎద్దేవా చేశారు. ఆరేళ్ళు వ్యవసాయం రంగం సంక్షోభంలో నెట్టి, ఇప్పుడు లక్షల కోట్లు ఇవ్వడమంటే ఏడిపించి ఓదార్చడమే అవుతోందని చాడ వెంకట్‌రెడ్డి పెదవి విరిచారు. రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటుధరలు కల్పించడంలో విఫలమైందన్నారు. దేశంలో రైతులకు అప్పులు బాగా పెరిగిపోయి ఆత్మహత్యలు పెరిగిపోతున్నదని, కల్తీ విత్తనాలు, సకాలంలో ఎరువులు అందక అనేక అవస్థలు రైతులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ ప థకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చే యడాన్ని పెడ చెవిన పెడుతున్నదని, ప్రభుత్వా లు ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నారే తప్పా, శా శ్వత పరిష్కార మార్గలు చూపడం లేదున్నారు.