దళితబంధుతో మిగిలిన వర్గాల్లో పెరుగుతున్న డిమాండ్
గిరిజనబంధు, బిసిబంధు కోసం ఆందోళనలు
ప్రజాపక్షం / ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఉద్ధరణ కోసం చేపట్టిన దళిత బంధు రాజకీయ ప్రాధాన్యత అం శంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్నట్లు లక్ష కోట్లు ఖర్చు చేస్తారా కడవరకు పథకం సాగుతుందా లేదా మూడెకరాల మాదిరి మూలనపడుతుందా అన్నది పక్కన పెడితే దళితబంధు మాదిరి తమకు కూడా పథకాన్ని రూపొందించి వర్తింపజేయాలని మిగిలిన సామాజిక వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు నేరుగా ఆర్థిక సాయం చేస్తామని ప్రతి నియోజక వర్గానికి 100 మంది చొప్పున తొలి దశలో వర్తింపజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనుంది. కేవలం ఉప ఎన్నికల స్టంట్‌గా కొంత మంది దళిత బంధును చూస్తుండగా మరి కొంత మంది దళితులతో పాటు గిరిజనులకు, బిసిలకు కూడా దళితబంధును వర్తింప జేయాలని డిమాం డ్ చేస్తున్నారు. పది నుంచి పదేహేను రోజులుగా రాష్ట్రంలో ఈ పథకాల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. దళితులకు ఇచ్చినట్లుగానే ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి బిసి కుటుంబానికి కూడా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక చేయూతనిచ్చి ఆర్థికంగా స్థిరపడేందుకు ఉపయోగపడాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ క్రమేణా విస్తృతమవుతోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకు వచ్చారని ఉప ఎన్నికల తర్వాత ఈ పథకం అడ్రస్ ఉండదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళితబంధు ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని దళితులకు సంబంధించి కెసిఆర్ చెప్పిన ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడగానే మొదటి ముఖ్యమంత్రిగా తానే పదవీని అధిష్టించారు. ఆ తర్వాత ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాలు అంటూ మరో ప్రకటన చేశారు. రెండున్నర ఎకరాల భూమి ఉన్నా మరో అర ఎకరం కొని ఇచ్చి ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాలు ఉండేవిధంగా చూస్తామన్నారు. ఈ పథకం ఒక శాతం కూడా అమలైన దాఖలాలు లేవు. ఆ రెండు వాగ్దానాలు నెరవేరలేదు. ఇప్పుడు దళిత బంధు ప్రజల ముగింటకు తీసుకు వచ్చారు. ప్రతి నియోజక వర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి రూ. 10 లక్షలను ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తుందో వేచి చూడాలి. దళిత బంధు అమలు అవుతుందో కాదో కానీ గిరిజన బంధు, బిసి బంధు కోసం ఆందోళనలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఈ ఆందోళనలు ఏ రూపం దాలుస్తాయో, రాజకీయంగా ఏ పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే.