ఎక్కడ చూసినా సాయుధ బలగాలే
అడుగడుగునా చెక్‌పోస్ట్‌లు, తనిఖీలు
రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అగచాట్లు
జమ్ము/శ్రీనగర్/కార్గిల్ : శ్రీనగర్లో ప్రస్తుతం ఎటుచూసినా సాయుధ బలగాలే ఉన్నాయి. బయటివారి సంగతి పక్కనపెడితే స్థానికులు కూడా ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా సిఆర్‌పిఎఫ్ బలగాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయి. ఎక్కడకు, ఎందుకు వెళుతున్నారు? అనే సిఆర్‌పిఎఫ్ జవాన్ల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. శ్రీనగర్, మధ్య 260 కి.మీ దూరాన్ని సాధారణ పరిస్థితుల్లో 67 గంటల్లో దాటేయొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతీ కిలోమీటర్‌కు ఓ సిఆర్‌పిఎఫ్ పోస్ట్(మొత్తం 260 పోస్టుల)ను ఏర్పాటుచేశారు. ప్రతీ వాహనానికి వారు ఓ ప్రత్యేక నంబర్ కేటాయిస్తున్నారు. అదుంటేనే బండి ముందుకు కదులుతుంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి చాలామంది కశ్మీరీలకు తెలియదు. ఇందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడమే కారణం. అయితే ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రజలకు తమ సాధారణ జీవితంతోపాటు రోజువారి ఉద్యోగాల నిమిత్తం రాకపోకలు సాగించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. వారికి సరియైన రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తం ఇంటర్ నెట్‌వర్క్ కార్యకలాపాలను ప్రభుత్వం నిలుపుదల చేయడంతో వారు పని చేయడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, ఇతర ఇంటర్‌నెట్ సేవలను పూర్తిగా నిలుపుదల చేయడంతో బయటి ప్రపంచంతో జమ్మూకశ్మీరీ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పరిస్థితి చాలా మంది ఉద్యోగులకు, వ్యాపారులకు అసౌకర్యంగా మారడమే కాక వారి జీవన భృతి దెబ్బతినేలా చేసింది. దీనిపై ఇక్కడేమన్నా కర్ఫ్యూ ఉందా? ఎం దుకు ఇలా ఇంటర్‌నెట్ సేవలు, మొబైల్ ఫోన్ల సేవలు నిలుపుదల చేశారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే తమ నివాస ప్రాంతాలకు చేరాలన్నా, అత్యవసరంగా వైద్య సదుపాయాలు పొందాలన్నా సరియైన రవాణా సౌకర్యాలు లేక అగచాట్లు పడుతున్న దృశ్యాలు అనేకం కన్పిస్తున్నట్లుగా కొందరు ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నా రు. మహ్మద్ షమీమ్ అనే మహిళ తను ప్రయాణిస్తున్న 65 కిలోమీటర్ల దూర ప్రయాణంలో ముగ్గురు వేర్వేరు వ్యక్తులను లిప్ట్ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఆమె దక్షిణ కశ్మీర్ నుంచి శ్రీనగర్‌కి ప్రయాణిస్తున్న సందర్భంగా ప్రయాణీకులు పడుతున్న అగచాట్లను కళ్లకు కట్టారు. ‘ఇక్కడేమన్నా కర్ఫ్యూ విధించారా?..ప్రజలను ఎందుకు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి ఆటంకాలు ఏర్పర్చుతున్నారు? మేమేమి ఇబ్బందులు కల్గించడం లేదుకదా? ఎందుకు మాకు ఆటంకం కల్గిస్తున్నారంటూ’ ఆమె సాయుధ బలగాల అధికారులను ప్రశ్నించింది. ఆమె ప్రయాణించిన 65 కిలోమీటర్ల ప్రయాణంలో ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు లిప్ట్ ఇచ్చినట్లుగా చెప్పారు. ఎలాగోలాగ తను పనిచేసే దక్షిణ కశ్మీర్‌లోని కేర్‌యూ ప్రాంతానికి చేరుకోగలిగినా తన పనిప్రదేశానికి వెళ్లడానికి ఆటంకాలు సృష్టిస్తున్నట్లుగా షహీమ్ తెలిపారు. షహీమ్ ఓ ప్రైవేటు ప్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే మరో సీనియర్ అధికారి ప్రమేయంతో ఆమె తన పనిప్రదేశంలోకి చేరగలిగింది. మరో పక్క తమ మొబైల్ ఫోన్లలో ఎలాంటి సంఘటనలను చిత్రించరాదంటూ పోలీసులు గట్టి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీనగర్‌లోని లాల్‌బజార్ ప్రాంతంలో నివసించే రమ్‌జాన్ అనే వ్యక్తి ఒకరికి తన కూతురు నుంచి అత్యవసరంగా తన వద్దకు రావాలనే పిలుపు ఆదివారం రాత్రి అందింది. ఆమె దక్షిణ కశ్మీర్‌లోని బుద్‌గామ్‌లో ఉంటుంది. కూతురు దగ్గరికి చేరుకోవాలని ఆ తండ్రి సోమవారం ఉదయమే బుద్‌గామ్ బయలుదేరారు. బుద్‌గామ్ శ్రీనగర్‌కి 35కిలోమీటర్ల దూరంలో ఉంది. బయటకి వచ్చిన ఆయనకు ఎలాంటి బస్సులు , ట్యాక్సీలు కన్పించలేదు. దీంతో ఆయన చేసేది ఏమీలేక కాలినడకనే బుద్‌గామ్‌కి బయలు దేరాడు.12 కిలోమీటర్లు నడిచిన అనంతరం ఆయన తీవ్ర అలసటతో కుప్పకూలిపోయాడు. దీంతో కిందపడిపోయిన రమ్‌జాన్‌ని భద్రతా వాహనంలో ఆసుపత్రికి తరలించినట్లుగా బిమానియా ఆసుపత్రి డాక్టర్ షఫ్‌కత్ భట్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు అనేకం ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని తాజా పరిస్థితులకు అద్దం పడుతున్నట్లుగా స్థానికులు కొందరు చెబుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై గవర్నర్ సమీక్ష
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పున ర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదాననంతరం నెలకొన్న తా జా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. బక్రీద్, శుక్రవారం ప్రార్థనల అంశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. కశ్మీర్ లోయలో బక్రీద్ సందర్భంగా మేకల కొనుగోళ్లకు మండీలను ఏర్పాటు చేసినట్లుగా గవర్నర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తాజాగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. ఈ కార్యక్రమం లో గవర్నర్ సలహాదారు కె. విజయ్‌కుమార్, స్కందన్, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ బివిఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
బక్రీద్ సందర్భంగా ఇళ్లకు రావాలనుకే విద్యార్థులకు తగిన ఏర్పాట్లు : గవర్నర్
బయట ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేస్తున్న జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు బక్రీద్ పండుగ సందర్భంగా తమ సొంత రాష్ట్రానికి తిరిగి రావాలనుకుంటే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాల్సిందిగా గవర్నర్ సమీక్షా సమేవేశంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. ఒకవేళ బక్రీద్ సందర్భంగా తమ సొంత ప్రాంతాలకు రాలేని విద్యార్థులకు వారు చదువుకునే ప్రాంతాల్లో పండుగ జరుపుకోవడానికి కావాల్సిన నిధులను గవర్నర్ మంజూరు చేసినట్లుగా తెలిపారు.