HomeNewsBreaking Newsబందూకులతో నిజాంపై… సింహగర్జన చేసింది కమ్యూనిస్టులే

బందూకులతో నిజాంపై… సింహగర్జన చేసింది కమ్యూనిస్టులే

సాయుధ పోరాటంలో ఏ పాత్రా లేని బిజెపి చరిత్రను వక్రీకరిస్తోంది
ఆ పార్టీకి తెలంగాణ విమోచనాన్ని నిర్వహించే హక్కులేదు
సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
సింహగర్జన చేస్తూ బందూకులతో నిజాం రాచరికాన్ని చావుదెబ్బ తిసింది కమ్యూనిస్టులేనని సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ అన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన అంతం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చేపట్టిన ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆనాడు జరిగిన పోరాటంలో ఏ పాత్రలేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇప్పుడు చర్రితను వక్రీకరించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఏర్పాటు చేసిన ప్రచార కటౌట్‌లను హిమాయత్‌ నగర్‌ సత్యనారాయణరెడ్డి భవన్‌ వద్ద శనివారం ఇటి నరసింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపికి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించే అర్హత, మాట్లాడే హక్కు లేదన్నారు. భారత యూనియన్‌లోకి హైదరాబాద్‌ రాష్ట్రం చేరడానికి చోదకశక్తిగా, అగ్రగామి దళంగా, త్యాగభరిత సాహస రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు. బిజెపి నేతలు కళ్లు తెరిచి తెలంగాణ చరిత్రను మరోసారి చదువుకోవాలన్నారు.
సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బిజెపి
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో హిందూ, ముస్లింలు కలసి నిజాం, భూస్వాములు, పటేల్‌, పట్వారీల ప్రైవేట్‌ సైన్యమైన రజాకార్ల అన్యాయ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు చేశారని నరసింహ గుర్తు చేశారు. తెలంగాణలో సాయుధ పోరాటంలో షేక్‌ బందగీ మొదట ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికార దాహంతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ అరాచక శక్తులు తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్నాయని విమర్శించారు. తెలంగాణ రైతాంగ పోరాటంతో సంబంధం లేని వారు తెలంగాణ విమోచనం అంటూ సంబురాలు జరుపుకోవడం హేయమైన చర్య అన్నారు. గంగా యమునా తెహజీబ్‌, మత సామరస్యం తెలంగాణ ప్రజలలో ఉందని, తెలంగాణలో మతోన్మాద వాతావరణం సృష్టిస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. ప్రజలను మతాల వారీగా చీల్చడానికి ప్రయత్నాలు చేస్తూ, తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్‌ చేసే బిజెపి కుయుక్తులను తిప్పికొట్టాలని ఇటి నరసింహ పిలుపునిచ్చారు.
అమరుల త్యాగాల చరిత్రను ప్రభుత్వం కాపాడాలి : వి.ఎస్‌.బోస్‌
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల అమరుల త్యాగాలు ఎప్పటికీ నిలిచేపోయేలా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బోస్‌ కోరారు. నిజాం నిరంకుశపాలనకు సమాధి కట్టేందుకు సిపిఐ, ఆంధ్ర మహాసభ, ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తరపున రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మఖ్దూం మొహినుద్దీన్‌లు ‘పోరాడితే పోయేదేమీలేదు, బానిస సంకేళ్లు తప్ప’ అనే నినాధంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌. ఛాయాదేవి, బి.స్టాలిన్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు ఎం.నరసింహ, బి.వెంకటేశం, బొడ్డుపల్లి కిషన్‌, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి ఉల్లాహ్‌ ఖాద్రి, ధర్మేంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోలి హరికృష్ణ, గ్యార నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments