భారత పేసర్ల ధాటికి 150 పరుగులకే చాపచుట్టేసిన హోల్కర్లు
రాణించిన మయాంక్, పుజారా
భారత తొలి ఇన్నింగ్స్ 86/1
మురళీధరన్ సరసన అశ్విన్
ఏకైక భారత బౌలర్‌గా రికార్డు
ఇండోర్ : సమష్టిగా రాణించి టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ టెస్టుల్లోనూ పైచేయి కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫేసర్లు అద్భుతమైన ప్రదర్శనతో బంగ్లాను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముష్ఫికర్ రహీమ్(43)పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శన కనబరచిన బంగ్లాదేశ్.. టీ20 ఓటమి నుంచి కోలుకున్నట్లు కనిపించడం లేదు. షమీ 3వికెట్లు, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో 2వికెట్లు తీయగలిగారు. ముష్ఫికర్ తో పాటు, మోమినుల్ హఖ్(37), లిటన్ దాస్(21)మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తడబడి రోహిత్ శర్మ(6)తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పూజారా(43) సహకారంతో మయాంక్ అగర్వాల్(37) క్రమంగా పరుగులు రాబట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 86పరుగులు చేయగలిగింది. క్రీజులో పూజారా, మయాంక్‌లు ఉన్నారు.
పేసర్ల దాటికి పటపటా..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాకు టీమిండియా పేసర్లు వరుస షాకులిచ్చారు. మహ్మద్ షమి (3/27) పాత బంతితో రివర్స్‌స్వింగ్ రాబట్టాడు. అతడికి తోడుగా ఇషాంత్ శర్మ (2/20), ఉమేశ్ యాదవ్ (2/47) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అశ్విన్ (2/43) కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. జట్టు స్కోరు 12 వద్దే ఓపెనర్లు ఇమ్రుల్ ఖేయాస్ (6)ను ఉమేశ్, షాద్‌మన్ ఇస్లామ్ (6)ను ఇషాంత్ ఔట్ చేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన మహ్మద్ మిథున్ (13)ను షమి వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో బంగ్లా 63/3తో లంచ్‌కు వెళ్లింది. బంగ్లా సారథి మోమినల్ హఖ్ (37; 80 బంతుల్లో 6స4) సహకారంతో సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (43; 105 బంతుల్లో 4స4, 1స6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లను కాచుకుని నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ క్రమంలో అశ్విన్ మిడిల్ స్టంప్‌పై వేసిన బంతిని ముందుకొచ్చి ఆడబోయిన మోమినల్ ఎల్బీగా దొరికిపోయాడు. అప్పుడు స్కోరు 99. మరికాసేపటికే మహ్మదుల్లా (10)ని యాష్ క్లీన్‌బౌల్ చేశాడు. ఒత్తిడిలోకి వెళ్లిన ముషిని షమి వరుస ఔట్‌స్వింగర్లతో విసిగించాడు. జట్టు స్కోరు 140 వద్ద ఏమైందో తేరుకునే లోపే ఓ ఇన్‌స్వింగర్ సంధించి అతడి ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టాడు. ఆ తర్వాత బంగ్లా ఆలౌట్ కావడానికి మరెంతో సమయం పట్టలేదు.
రోహిత్ తక్కువ స్కోరుకే..
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ పేలవంగా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన బాంగ్లా జట్టు బౌలర్ అబు జాయెద్ బౌలింగ్‌లో బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ కీపర్ లిట్టన్ దాస్ చేతికి చిక్కాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని ఆడే సమయంలో రోహిత్ శర్మ తన పాదాల్ని కదల్చకుండా ఆడటమే తప్పిదమని మ్యాచ్ కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్య.. ఫుట్‌వర్క్. బంతి శరీరంపైకి దూసుకొచ్చినా.. అలవోకగా ఫుల్‌షాట్స్ ఆడగలిగే రోహిత్ శర్మ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని పాదాల కదలికతో ముందుకు వచ్చి ఆడటం విఫలమవుతూ వస్తున్నాడు. స్టాన్స్ తీసుకున్న పొజిషన్ నుంచే పాయింట్ దిశగా బంతిని కట్ చేయాలని యత్నిస్తూ కొన్నిసార్లు తేలిపోతున్నాడు. వన్డే, టీ20ల్లో వినియోగించే తెలుపు రంగు బంతితో పోలిస్తే.. టెస్టుల్లో వినియోగించే ఎరుపు రంగు బంతి కాస్త ఆగి నెమ్మదిగా బ్యాట్‌పైకి వస్తుంది. కానీ.. రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ ఒకే తరహాలో షాట్ ఆడుతూ వస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సమయంలో ఈ బలహీనతని కొంత వరకూ అధిగమించిన ఈ ఓపెనర్.. మళ్లీ అదే తప్పిదంతో మూల్యం చెల్లించుకున్నాడు. టీ20ల్లో అయితే ఆ బంతి ఫోర్‌గా వెళ్లేదేమో.. కానీ.. టెస్టులు కావడంతో అది ఎడ్జ్ తీసుకుని వెనక్కి వెళ్లి కీపర్ చేతికి చిక్కింది.
పుజారా నిలకడగా..
జట్టు స్కోరు 14 వద్ద రోహిత్ శర్మ (6; 14 బంతుల్లో 1స4)ను అబు జయేద్ ఓ చక్కని బంతికి ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్ పిచ్ అయిన బంతిని కాళ్లు కదలించకుండా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన హిట్‌మ్యాన్ కీపర్ లిటన్‌దాస్‌కు దొరికిపోయాడు. వీరోచిత ఫామ్‌లో ఉన్న అతడు తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో హోల్కర్ మైదానం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఆ తరువాత నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (43 బ్యాటింగ్; 61 బంతుల్లో 7స4) వరుస బౌండరీలతో బంగ్లా పులులకు షాకిచ్చాడు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన 15వ ఓవర్లో మూడు ఫోర్లు బాది తన ఉద్దేశమేంటో స్పష్టం చేశాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ అందివచ్చిన బంతుల్ని అమాంతం బౌండరీ సరిహద్దులు దాటించేశాడు. అర్ధశతకం సాధించాడు. పుజారాకు తోడుగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (37; 81 బంతుల్లో 6స4) తన సొగసైన ఆటతో అలరించాడు. మణికట్టును ఉపయోగించి చక్కని టైమింగ్‌తో అతడు బాదిన బౌండరీలు చూస్తే ఆహా..! అనిపించింది. తన దేశవాళీ క్రికెట్ అనుభవాన్ని ఉపయోగించి సాధికారికంగా ఆడాడు. జోరుమీదున్న పుజారాకు ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అశ్విన్ సాధించెన్..
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ సరసన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అతి తక్కువ టెస్టుల్లో 359 వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. అంతేనా.. స్వదేశంలో కేవలం 42 టెస్టుల్లో 250 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన తొలి భారత బౌలర్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ రెండో సెషన్‌లో బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మొమినల్ హక్ (37) పరుగుల వద్ద క్లీన్‌బౌల్డ్ చేశాడు. తద్వారా స్వదేశంలో అతి తక్కువ టెస్టుల్లో 250 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. కాగా, 2011 నవంబరు ఆరో తేదీన టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అశ్విన్… ఇప్పటివరకు మొత్తం 69 టెస్టులాడి 359 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 27 సార్లు ఐదు వికెట్లు సాదించాడు. 10 వికెట్లను 7సార్లు సాధించాడు. అయితే టెస్టుల్లో సొంతగడ్డపై శ్రీలంక స్పిన్నర్ ముత్తయ మురళీధరన్ 42 టెస్టులు ఆడి 250 వికెట్లు తీసుకున్నాడు. భారత దిగ్గజ బౌలర్ మాజీ సారధి అనిల్ కుంబ్లే 43 టెస్టులో ఈ ఘనత సాధిస్తే, అశ్విన్ మాత్రం 42 టెస్టుల్లోనే మైలురాని అందుకున్నాడు. మరో భారత స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ సొంత గడ్డపై 51 టెస్టుల్లో 250 వికెట్లు తీశాడు. కానీ, 42 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించి మురళీధరన్ రికార్డును సమం చేశాడు. వీరి తర్వాత శ్రీలంక మరో బౌలర్ హెరాత్ (44), డేల్ స్టెయిన్ (49) మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్(58 ఓవర్లు)
భారత్ తొలి ఇన్నింగ్స్: 86/1
బంగ్లా బోల్తా!
RELATED ARTICLES