ప్రతి కుటుంబానికి స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల సహాయం
ప్రజాపక్షం/సిద్దిపేట/సిద్దిపేట టౌన్ : చింతమడక గ్రామం అభివృద్ధిలో అందరికి ఆదర్శంగా నిలవాలని సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, సిద్దిపేట మండలంలోని చింతమడకలో గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు గ్రామానికి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయల ఆర్థ్ధిక సహాయాన్ని స్వయం ఉపాధి కింద అందించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా యువత తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకొని లబ్ధి పొందాలన్నారు. వరి నాటు యంత్రాలు, పాడి పరిశ్రమతో లాభాలు అధికంగా ఉంటాయని చెప్పారు. ఆ దిశగా ఆలోచన చేసి ముందడుగు వేయాలన్నారు. చింతమడకతో పాటు గ్రామపంచాయితీ పరిధిలో గల అంకంపేట, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామస్థులను కలుపుకొని మొత్తం 2వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామస్ధుల ఐఖ్యమత్యం, ఓర్పుతో ఉంటూ చింతమడకను మోడ్రన్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. గ్రామ అభివృద్ధ్ది బాధ్యత కలెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామంలో కంటి, ఆరోగ్య వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి స్థ్దాయి పరీక్షలు నిర్వహించి చికిత్స అవసరమైన వారికి కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామం రాష్ట్ర స్థాయి హెల్త్ ప్రొఫైల్‌కు నాంది పలకాలని తెలిపారు. వచ్చే కార్తీక మాసం వరకు గ్రామంలో 2వేల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తాను ఈ గ్రామంలో పుట్టడమే అదృష్టమన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గ్రామస్థులతో పంచుకున్నారు. గ్రామంలోని చెరువులు, బావుల్లో ఈత కొడుతూ సరదాగా గడిపిన క్షణాలను నెమరు వేసుకున్నారు. గ్రామస్థులను పేరు, పేరునా పలకరించి వారితో కరచాలనం చేశారు. మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఇకపై చింతమడక గ్రామం చింతలు లేని గ్రామంగా రూపుదిద్దుకుంటుందన్నారు. గ్రామంలో నిర్వహించిన సర్వేను సిఎం దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు ప్రత్యేక హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న సిఎంకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీమంత్రి హరీశ్‌రావు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు.