హైదరాబాద్: పార్టీ టిక్కెట్ వస్తుందన్న ఆశతో ముందస్తు ప్రచారం చేపట్టిన నేతలకు టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబావుటా ఎగరవేసిన రెబెల్స్ చివరి నిమిషంలో మెత్తబడ్డారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుందనగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ఆయా పార్టీలు చేసిన ప్రయత్నాలు సైతం ఫలితాలనిచ్చాయి.
* శేరిలింగంపల్లి శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ భిక్షపతి యాదవ్, టీడీపీ రెబల్ మువ్వ సత్యనారాయణ, టీఆర్ఎస్ రెబల్ శంకర్ గౌడ్, మరో ఐదుగురు నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు..
* చేవెళ్లలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పడాల వెంకట స్వామి సైతం వెనక్కి తగ్గారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రత్నంకు మద్దతు ఇస్తానని ప్రకటించారు.
* మేడ్చల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జంగయ్యయాదవ్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
* కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి హనుమంత రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
* కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అసంతృప్త నేతలు వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అసమ్మతి నేతలు సుభాష్ రెడ్డి, మాల్యాద్రిరెడ్డి తమ నామినేషన్ ఉపసహరించుకునేందుకు సమ్మతించారు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో అసమ్మతి నేతలతో కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చర్చించారు. ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, బాన్సువాడ నుంచి మాల్యాద్రిరెడ్డి నామినేషన్ వేశారు. ఉపసంహరణ కోసం నేతలు మంతనాలు జరపగా.. చివరకు నామినేషన్ ఉపసంహరణకు సమ్మతించారు. పార్టీలో టికెట్లు త్యాగం చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి చెప్పారు.
* కోదాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శశిధర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు అంగీకరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిశారు. సముచిత స్థానం కల్పించడంతోపాటు ఎమ్మెల్యే స్థాయికి తగ్గకుండా రాబోయే ప్రభుత్వంలో గౌరవ ప్రథమైన స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు.
* కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేణుమాధవ్ సైతం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
* మిర్యాలగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేంద్రరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వచ్చి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
* వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ స్థానానికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ప్రజాకూటమిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని టిడిపికి కేటాయించారని, పార్టీ సూచన మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని మీడియాకు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కూటమి తరఫున ప్రచారం చేస్తానని, టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతిస్తానని పేర్కొన్నారు.
ఫలించిన బుజ్జగింపులు
RELATED ARTICLES