HomeNewsBreaking Newsఫ్యాక్షనిజానికి చోటు లేదు

ఫ్యాక్షనిజానికి చోటు లేదు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ రాష్ర్ట మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగినట్లు బయటపడటం దిగ్భ్రాంతికి గురిచేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఫ్యాక్షన్‌ సంస్కృతిని మొగ్గలోనే తుంచివేయాలని ప్రభుత్వాన్ని చాడ వెంకట్‌రెడ్డి కోరారు. విలువలతో కూడిన రాజకీయాలకు నిలయమైన తెలంగాణలో ఇటీవల రాయలసీమ తరహా ఫ్యాక్షనిజం పోకడలు పోడచూపడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిలో ఫ్యాక్షనిజానికి చోటులేదని, దానిని ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉంది
బిజెపి ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పై హత్యకు కుట్ర పన్నారంటూ మహబూబ్‌నగర్‌ యువకులపై సైబరాబాద్‌ పోలీసులు తప్పుడు కేసు పెట్టారని బిజెపి ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ అన్నారు. బాధితుల భార్యా, పిల్లలు తన వద్దకు వస్తే ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై మాట్లాడానని తెలిపారు. ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని, కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో అవకాశం ఉన్న అన్ని విచారణ సంస్థలు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మహబూబ్‌నగర్‌లో అరాచకం చేస్తున్న మంత్రి తనపై సానుభూతి తెచ్చుకునేందుకు హత్యకు కుట్ర అని కేసు పెట్టించుకున్నారని అన్నారు. కాగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ గురువారం నాడు హైదరాబాద్‌లోని డి.కె.అరుణ నివాసానికి వెళ్ళి ఆమెను కలిసారు.
హైకోర్టును ఆశ్రయిస్తాంః జితేందర్‌రెడ్డి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధించి పెట్టిన తప్పుడు కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తామని బిజెపి నేత, మాజీ ఎంపి ఎ.పి.జితేందర్‌రెడ్డి తెలిపారు.సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ప్రెస్‌ మీట్‌ చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. సామాజిక బాధ్యతగా ఆర్‌టిఐ ద్వారా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తప్పులను బయట పెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారని,ఇది రాజకీయ కుట్ర తో పెట్టిన కేసు అని ఒక ప్రకటనలో తెలిపారు.
సిబిఐ విచారణ జరిపించాలి
ఎఐసిసి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌
ఏకంగా ఒక మంత్రి హత్యకు కుట్ర జరిగిందని చెబుతున్నారని, ఈ కుట్రలో జాతీయ స్థాయిలో పని చేస్తున్న బిజెపి నాయకుల పేర్లు వినిపిస్తున్నాయని, దీని వెనుక ఎవరి పాత్ర ఉందో తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలని ఎఐసిసి కార్యదర్శి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, బిజెపి నాయకులు, సైబరాబాద్‌ సిపి స్టీఫెన్‌ రవీంద్రలను బహిరంగంగా లైడిటెక్టర్‌ పరీక్షలు చేసి హత్య కుట్ర కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు. ఒక రాష్ర్ట మంత్రిని హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్‌ రంగప్రవేశం చేయడం, అదీ బిజెపి జాతీయ నాయకుల పాత్ర ఉందని పోలీసులు వెల్లడించడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని దాసోజు గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అసలు రూ.15 కోట్లు ఎవరు, ఎక్కడ ఇచ్చారు? సుపారీ హంతకుల వద్ద దొరికిన తుపాకులెవరివి? అసలు మంత్రిని ఎందుకు హత్య చేయాలనుకున్నారో వెల్లడించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మొత్తం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. చంపాలని కుట్ర చేశారంటే నమ్మబుద్ది కావడంలేదు
టిపిసిసి అధ్యక్షులు ఏ.రేవంత్‌రెడ్డి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రూ.15కోట్లతో ఒప్పందంతో చంపాలని కుట్ర చేసారంటే నమ్మబుద్ధి కావడం లేదని, మంత్రిపై హత్య కుట్రను న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని టిపిసిసి అధ్యక్షులు ఏ.రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డికే అరుణ,జితేందర్‌ రెడ్డి ఇళ్లపై గుండాలతో దాడులు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణను మరో బీహార్‌ మార్చే పరిస్థితి ఉందని, సుపారీ మాట్లాడిన వ్యక్తి మొత్తం ఆస్తులు అమ్మినా రూ.15 లక్షలు రావని అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిజిపికి ట్రీట్‌మెంట్‌ ఇస్తే హెల్త్‌ బులిటెన్‌ ఎందుకు విడుదల చేయడం లేదని, మంత్రిపై హత్యాయత్నం జరిగితే సిఎం ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలన్నీ టిఆర్‌ఎస్‌కు కట్టుబానిసలు అయ్యాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments