మూడు పరుగులతో లంక విజయం, ఎమర్జింగ్ టీమ్స్ కప్ టోర్నీ
కొలంబో: ఎమర్జింగ్ టీమ్స్ కప్ టోర్నీలో అద్భుత పోరాటాన్ని కనబరిచిన భారత జట్టు ఫైనల్లో మాత్రం ఓడిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో శ్రీలంక మూడు పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎమర్జింగ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కమిండు మెండీస్ (61; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బొయగోడ (54), శిశాన్ జయసూర్య (46), వానిందు డిసిల్వా (31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్ రెండు వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత ఎమర్జింగ్ జట్టుపై లంక బౌలర్లు ఎదురుదాడికి దిగారు. దీంతో భారత్ జట్టు 65 పరుగులుకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. తర్వతా నితీష్ రానా (48 బంతుల్లో 40), కెప్టెన్ జయంత్ యాదవ్ (71; 85 బంతుల్లో 5 ఫోర్లు), ములాని (46) పరుగులు చేసినా తమ జట్టును విజయతీరానికి చేర్చలేక పోయారు. చివర్లో అకాశ్ సేత్ 15 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో అజేయంగా 28 పరుగులు చేసి విజయంపై ఆశలు రేపినా ఫలితం దక్కలేదు. చివరికి భారత జట్టు మూడు పరుగులతో ఓటమిపాలైంది. లంక బౌలర్లలో గుణరత్నే మూడు వికెట్లు తీయగా.. జయసూర్య, అంబుల్‌డెనియా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మ్యాచ్‌లో రాణించిన కమిండు మెండీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.
ఫైనల్లో భారత్ ఓటమి
RELATED ARTICLES